Let's talk: editor@tmv.in
రెజ్లింగ్‌ను ముగించిన..ప్రపంచ చాంపియన్ జాన్‌సీనా

రెజ్లింగ్‌ను ముగించిన..ప్రపంచ చాంపియన్ జాన్‌సీనా

Pinjari Chand
15 డిసెంబర్, 2025

రింగ్‌లో అడుగుపెట్టిన ప్రతిసారి అభిమానుల్లో ఉత్సాహం రగిలించిన స్వరం ‘మై టైం ఇజ్ నౌ’. ఆ స్వరంతో పాటు రెండు దశాబ్దాలకు పైగా డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో తనదైన ముద్ర వేసిన జాన్ సీనా, ఇప్పుడు తన ఇన్-రింగ్ ప్రయాణానికి ఉద్వేగంతో వీడ్కోలు పలికారు. విజయం, ఓటమి, అపారమైన అభిమాన ప్రేమల మధ్య సాగిన ఈ ప్రయాణంలో, సీనా కేవలం చాంపియన్‌గా కాదు.. ఒక యుగానికి ప్రతీకగా మారారు.

ప్రొఫెషనల్ రెజ్లింగ్ చరిత్రలో ఒక యుగానికి తెరపడింది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) లెజెండ్, 17 సార్లు రికార్డు బ్రేకింగ్ వరల్డ్ చాంపియన్ అయిన జాన్ సీనా తన ఇన్-రింగ్ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన అద్భుతమైన కెరీర్‌ను సీనా డిసెంబర్ 13న జరిగిన ‘సాటర్ డే నైట్ మెయిన్ ఈవెంట్’తో ముగించారు. సీనా తన చివరి మ్యాచ్‌లో వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్ గుంథర్ చేతిలో స్లీపర్ హోల్డ్‌కు సబ్‌మిషన్ (ట్యాప్ అవుట్) ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో అత్యంత చరిత్ర కలిగిన కెరీర్‌కు భావోద్వేగ ముగింపు పలికిన క్షణంగా నిలిచింది.

రెజ్లింగ్ ప్రపంచం నుంచి వీడ్కోలు

సీనా రిటైర్‌మెంట్ సందర్భంగా ప్రస్తుత, డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సూపర్‌స్టార్లు, లెజెండ్లు, అభిమానులు ఆయనకు హృదయపూర్వకంగా వీడ్కోలు తెలిపారు. ప్రస్తుత అండిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ కోడీ రోడ్స్ సీనా ప్రభావాన్ని కొనియాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో సీనా తల్లిదండ్రులు ఆయన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, కృషి గురించి మాట్లాడారు. ఈ వీడియోలో ది మిజ్, సీఎం పంక్, డ్రూ మెక్‌ఇంటైర్, సామీ జైన్, డబ్ల్యూడబ్ల్యూఈ సీసీఓ ట్రిపుల్ హెచ్, ది అండర్‌టేకర్, బెకీ లించ్ వంటి ప్రముఖులు సీనా రెజ్లింగ్‌కు చేసిన సేవలను గుర్తు చేశారు.

ది రాక్, మిక్ ఫోలీ, రియా రిప్లీ ప్రశంసలు

మ్యాచ్‌కు ముందు హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్ సోషల్ మీడియాలో సీనా వినయం, వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. మంచివాడిగా ఉండటం మరింత ముఖ్యమని నువ్వు నిరూపించావు అని పేర్కొన్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ చాంపియన్ మిక్ ఫోలీ జాన్ సీనాను చివరిసారి చూడటం గౌరవంగా భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మహిళల చాంపియన్ రియా రిప్లీ థ్యాంక్యూ జాన్ సీనా అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.

చివరి మ్యాచ్ వివరాలు

గుంథర్ ఎంట్రీ తర్వాత, జాన్ సీనాకు అభిమానులు నిలబడి చప్పట్లతో, ఆయన థీమ్ సాంగ్ ‘ మై టైం ఇజ్ నౌ’ను ఆలపిస్తూ ఘన స్వాగతం పలికారు. రింగ్‌ కు ఓ సైడ్‌లో సీనా దీర్ఘకాల మిత్రులు, ప్రత్యర్థులు ఉన్నారు. మ్యాచ్‌లో గుంథర్ ఛాప్‌లు, అప్పర్‌కట్‌లతో దాడి చేస్తే, సీనా సిగ్నేచర్ మూవ్‌లు, ఫైవ్ నకిల్ షఫుల్, అటిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్, అనౌన్స్ టేబుల్ దాడులతో తిరిగి పోరాడారు. ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో చివరికి గుంథర్ స్లీపర్ హోల్డ్‌తో సీనాను ట్యాప్ అవుట్ చేయించాడు. ‘నెవర్ గివ్ అప్’ నినాదానికి ప్రాణం పోసిన సీనా, చివరి మ్యాచ్‌లో ట్యాప్ అవుట్‌తో ఓడిపోవడం భావోద్వేగాన్ని కలిగించింది.

భావోద్వేగ వీడ్కోలు

మ్యాచ్ తర్వాత సీనా రింగ్ మధ్యలో కూర్చుని అభిమానుల ఆదరణను ఆస్వాదించారు. అభిమానులు థ్యాంక్యూ సీనా అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత కోడీ రోడ్స్, సీఎం పంక్, ట్రిపుల్ హెచ్, షాన్ మైకెల్స్, ఏజే స్టైల్స్, ది మిజ్, డామియన్ ప్రీస్ట్, కార్మెలో హేయ్స్ సహా మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ రోస్టర్ రింగ్‌కు వచ్చి వీడ్కోలు చెప్పారు. కోడీ రోడ్స్, సీఎం పంక్ తమ చాంపియన్‌షిప్ బెల్ట్‌లను సీనా భుజాలపై ఉంచి, 17 సార్లు చాంపియన్‌గా ఆయన రికార్డును గౌరవించారు. సీనా తన షూస్, ఆర్మ్‌బ్యాండ్స్‌ను రింగ్‌లో వదిలి, రింగ్‌ను ముద్దుపెట్టుకుని బయటకు వెళ్లారు. ఇది అభిమానులను కన్నీళ్లు పెట్టించింది.

• జాన్ సీనా కెరీర్ హైలైట్స్17 సార్లు వరల్డ్ చాంపియన్ (రికార్డు)

• 5 సార్లు యునైటెడ్ స్టేట్స్ చాంపియన్

• 1 సారి ఇంటర్‌కాంటినెంటల్ చాంపియన్

• 4 ట్యాగ్ టీమ్ టైటిల్స్

• డబ్ల్యూడబ్ల్యూఈ గ్రాండ్ స్లామ్ విజేత

• 2 సార్లు రాయల్ రంబుల్ విజేత

• 1 సారి మనీ ఇన్ ది బ్యాంక్ విజేత

• అనేక వ్రెస్టిల్‌మేనియా మెయిన్ ఈవెంట్లు

చివరి సంవత్సరంలో

2025 రిటైర్‌మెంట్ టూర్‌లో వ్రెస్టిల్‌మేనియా 41లో ట్రావిస్ స్కాట్ సహాయంతో కోడీ రోడ్స్‌ను ఓడించి రికార్డు 17వ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు (షార్ట్ హీల్ టర్న్‌తో).

సమ్మర్‌స్లామ్‌లో కోడీ రోడ్స్‌కు టైటిల్ అప్పగించి పాజిటివ్ క్యారెక్టర్‌కు తిరిగి వచ్చారు.

బ్రాక్ లెస్నర్, ఏజే స్టైల్స్, లోగన్ పాల్, సామీ జైన్, డొమినిక్ మిస్టీరియోలతో ఇంటెన్స్ మ్యాచ్‌లు.

నవంబర్‌లో ఇంటర్‌కాంటినెంటల్ టైటిల్ గెలిచి కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేశారు. రెండు దశాబ్దాల పాటు రెజ్లింగ్ ప్రపంచాన్ని ఆకర్షించిన జాన్ సీనా ఇన్-రింగ్ కెరీర్ ముగిసినా, ఆయన వారసత్వం డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

రెజ్లింగ్‌ను ముగించిన..ప్రపంచ చాంపియన్ జాన్‌సీనా - Tholi Paluku