
రెచ్చగొట్టే ప్రసంగాలే శాంతికి ముప్పు: సీఎం సిద్ధరామయ్య
సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఉద్దేశించిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్–2025కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మద్దతు తెలిపారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ నిలవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
బిల్లు రాష్ట్ర శాసనసభ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. రెచ్చగొట్టే ప్రసంగాలు సమాజంలో శాంతిని నిలబెట్టగలవా? బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తోంది కాబట్టే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు వ్యక్తులు లేదా సమూహాల మధ్య ద్వేషం, శత్రుత్వం, సామాజిక విబేధాలను ప్రోత్సహించే ప్రసంగాలు, చర్యలను నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా హోం మంత్రి జి. పరమేశ్వర వివరాలు వెల్లడించారు. విద్వేష నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం అవసరమని, ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు, చర్యలే విద్వేష నేరాలుగా పరిగణించాలని ఆయన తెలిపారు. బిల్లులో శిక్షలకు సంబంధించిన వివరాలపై మాట్లాడుతూ విద్వేష నేరాలకు పాల్పడినవారికి కనీసం ఒక సంవత్సరం నుంచి గరిష్ఠంగా ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తాం. అదే నేరాన్ని రెండు, మూడోసారి చేస్తే శిక్షను రెండు సంవత్సరాలకు పెంచి, జరిమానాను రూ.లక్షకు పెంచుతామని చెప్పారు.
ఎవరినీ లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకురాలేదు
బిల్లు ఆమోదం అనంతరం పరమేశ్వర బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ బిల్లును ఎవరినీ లక్ష్యంగా చేసుకుని తీసుకురాలేదు. విద్వేష ప్రసంగాలకు పాల్పడే ఎవరైనా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. సుప్రీంకోర్టు కూడా ద్వేష ప్రసంగాలను కట్టడి చేయాలని ఆదేశించింది. హత్యల వరకు వెళ్లిన ఘటనలు జరిగాయి. ఇవన్నీ ఆపాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం బీజేపీని దృష్టిలో పెట్టుకుని తీసుకురాలేదని స్పష్టం చేశారు.
