Let's talk: editor@tmv.in
రెండో విడత పంచాయతీ ఎన్నిక‌ల‌కు సర్వం సిద్ధం

రెండో విడత పంచాయతీ ఎన్నిక‌ల‌కు సర్వం సిద్ధం

Gaddamidi Naveen
14 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఆదివారం (డిసెంబర్ 14) జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.కాగా, తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పట్టణాలలో, నగరాలలో ఉంటున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు బయలుదేరారు. వారాంతం ఎన్నికల పోలింగ్ కలవడంతో స్వగ్రామాలకు వెళ్లే వారి రద్దీ భారీగా పెరిగింది.

నేడు జ‌రుగ‌నున్న‌ రెండో విడత పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయంతో జిల్లా స్థాయి అధికారులు పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రిని శ‌నివారం పంపిణీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్లు, సీల్స్‌, ముద్రలు, ఓటర్ల జాబితాలు తదితర సామగ్రిని సిబ్బందికి అందజేశారు.

నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును పెంచారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత, వేరే రోజుకు వాయిదా వేయకుండా అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ (ఓట్ల లెక్కింపు) ప్రక్రియను ప్రారంభించనున్నారు.

రెండో దశ ఎన్నికల్లో మొత్తం 4,331 గ్రామ సర్పంచ్‌ స్థానాలకు నోటిఫికేషన్‌లు జారీ కాగా, వాటిలో 415 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరో 5 గ్రామ సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన స్థానాల్లో పోటీ కొనసాగుతోంది.అలాగే గ్రామ పంచాయితీల్లోని వార్డు సభ్యుల ఎన్నికల విషయానికి వస్తే, మొత్తం 38,332 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 8,308 వార్డులు ఏకగ్రీవంగా తేలాయి. మిగిలిన వార్డుల్లో పోలింగ్ జరగనుంది.

గ్రామస్థాయి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నేడు పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.