Let's talk: editor@tmv.in
రెండో వన్డేలో మరో రికార్డు దిశగా విరాట్ కోహ్లీ

రెండో వన్డేలో మరో రికార్డు దిశగా విరాట్ కోహ్లీ

Pinjari Chand
14 జనవరి, 2026

భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునే అంచున నిలిచాడు. న్యూజిలాండ్‌తో బుధవారం రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్లో మరో అర్ధసెంచరీ సాధిస్తే, వరుసగా అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. 37 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన చివరి వన్డే నుంచి ప్రారంభమైన అతని వరుస 50+ స్కోర్ల పరంపర, వడోదరలో జరిగిన తొలి న్యూజిలాండ్ వన్డేలోనూ కొనసాగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఆకట్టుకున్నాడు. రన్-ఎ-బాల్ కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడిన కోహ్లీ పూర్తిగా నియంత్రిణ, ఒడిదుడుకులు లేకుండా బ్యాటింగ్ చేసి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.

ప్రస్తుతం భారత ఆటగాళ్లలో

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, అజింక్య రహానే — వీరందరూ వరుసగా ఐదు వన్డే 50+ స్కోర్లు సాధించిన రికార్డుతో కోహ్లీతో సమానంగా ఉన్నారు. మరో అర్ధసెంచరీ సాధిస్తే, వరుసగా ఆరు వన్డే 50+ స్కోర్లు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, పాకిస్థాన్ లెజెండ్ జావేద్ మియాందాద్ (వరుసగా 9 50+ స్కోర్లు), ఇమామ్ ఉల్ హక్ (7 50+ స్కోర్లు) ఈ జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నారు. ఇక కేన్ విలియమ్సన్, షై హోప్, బాబర్ ఆజం, పాల్ స్టిర్లింగ్, రాస్ టేలర్, క్రిస్ గేల్ వంటి స్టార్ బ్యాట్స్‌మన్‌లు వరుసగా ఆరు 50+ వన్డే స్కోర్లు సాధించిన వారిలో ఉన్నారు. తన చివరి ఐదు వన్డే మ్యాచ్‌ల్లో కోహ్లీ 469 పరుగులు సాధించాడు. అతని సగటు 156.33, ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్‌లను కూడా కలిపితే (131, 77), కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్‌లో వరుసగా ఏడు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఈ ఏడు ఇన్నింగ్స్‌లో అతను మొత్తం 677 పరుగులు, సగటు 135.4తో, మూడు సెంచరీలు, నాలుగు ఫిఫ్టీలు చేశాడు.

జట్లు:

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఆయుష్ బదోని, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్.

న్యూజిలాండ్ జట్టు: డెవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమిసన్, ఆదిత్య అశోక్, జేడెన్ లెనాక్స్, నిక్ కెల్లీ, జోష్ క్లార్క్‌సన్, మైఖేల్ రే.