
రెండేళ్ల రక్తపాతం
ప్రపంచానికి శాంతిని నేర్పిన క్రీస్తు జన్మస్థలం రెండేళ్లగా రక్తంతో తడిసిముద్దవుతుతోంది. శాంతి కపోతం ఎగిరిన నేల.. ఇప్పుడు స్వేచ్ఛ కోసం తపిస్తుంది. అల్లర్లతో దేశమెప్పుడో బీటలు బారింది. ఖాళీ కడుపులకు బుక్కెడు బువ్వ లేదు. దాహం తీర్చుకోవడానికి గుక్కెడు నీరు లేదు. కరెంటు కోతలతో రాత్రీ, పగలు తేడా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే గాజా గాజు ముక్కలా ముక్కలైంది. అరబ్బులు, యూదులంటూ సాగుతున్న వైరంలో మతం రంగు మారణహెూమాన్ని సృష్టించింది. హద్దులు, సరిహద్దులను దాటుతూ స్వేచ్ఛకై సాగుతున్న సమరానికి సరిగ్గా రెండేళ్లు. అయినా ఇప్పటికీ గాజా గడ్డపై నెత్తురు ప్రవహిస్తూనే ఉంది.
అక్టోబర్ 7,2023న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ రెండేళ్లలో దాదాపు 67వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షా 70వేల మందికి పైగా గాయపడ్డారు. ఒకప్పుడు చికిత్స చేసిన వైద్యులు ఇప్పుడు చీకటిలో కూర్చుని శరీరాలను కప్పుతున్నారు. 36 ఆస్పత్రుల్లో 34 పూర్తిగా ధ్వంసమయ్యాయి. 400 కంటే ఎక్కువ దాడులు ఆస్పత్రులు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిపై జరిగాయి. 150 అంబులెన్సులు బూడిదయ్యాయి. విద్యుత్తు లేకుండా, మందులు లేకుండా, వైద్యులు ఆపరేషన్లు చేయాల్సిన దారుణ పరిస్థితి దాపరించింది. ఇక ఆకలి ఇప్పుడు యుద్ధ ఆయుధంగా మారింది. ఆహారం తినే పిల్లలు లేరు, ఆకలి తింటున్న పిల్లలే ఉన్నారు. గత ఆగస్టులోనే ఐక్యరాజ్యసమితి గాజాలో కరువు ప్రకటించింది. 5 లక్షలకుపైగా ప్రజలు అత్యంత ప్రమాద స్థాయి ఆకలితో ఉన్నారు. 10 లక్షలకుపైగా ప్రజలు అత్యవసర స్థితిలో ఉన్నారు. 400 పిల్లలు ఆకలి వల్ల చనిపోయారు. సహాయక వాహనాలు సరిహద్దుల్లో నిలిచిపోయాయి.
ఇళ్లను వదిలి పారిపోయిన వారు ఇప్పుడు రోడ్డుపై జీవిస్తున్నారు. 19లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2025 మార్చిలో జరిగిన దాడిలో 12 లక్షల మంది గాజా నగరం విడిచారు. 88 శాతం భూమి ఖాళీ చేయమని ఆదేశాలు వచ్చాయి. వృద్ధులు, పిల్లలు, గాయపడినవారు మైళ్ల దూరం నడిచారు. కొన్ని కుటుంబాలు బంగారం అమ్మి వాహనంలో పారిపోయారు. ఇటు గాజా భూమి కూడా గాయపడింది. 2025 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ కొన్ని లెక్కలు చెప్పింది. గాజాను తిరిగి బాగు చేయడానికి దశాబ్దాలు పడుతుందని తేల్చింది. సముద్రపు నీరు విషమైంది. 97శాతం పంట మొక్కలు, 95శాతం గ్రీన్‌హౌస్‌లు, 82శాతం పంటలు నాశనం అయ్యాయి. 2,50,000 భవనాల్లో 78 శాతం కూలిపోయాయి. 61 మిలియన్ టన్నుల శిథిలాలు నేల మీద ఉన్నాయి. ఆ ధూళిలో విషం దాగి ఉంది. మరోవైపు విద్యావ్యవస్థ కూడా నాశనమైంది. 179 ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 100 యుఎన్ పాఠశాలలు క్లోజ్ అయ్యాయి. 20 విశ్వవిద్యాలయాలు కూలిపోయాయి. 18,000 విద్యార్థులు చనిపోయారు. 1,000 మంది ఉపాధ్యాయులు కన్నుమూశారు. 5,000 మంది గాయపడ్డారు.
ఇక ఘటన జరిగిన అక్టోబర్ 7, 2023 నాటి విషయాలను ఓసారి గుర్తుచేసుకుందాం. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ నాడు ఇజ్రాయెల్‌పై చేసిన దాడుల్లో 1200మందికిపైగా చనిపోయారు. నిజానికి ముందుగా హమాసే దాడి చేసిందని.. అందుకే ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే కావొచ్చు.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది మొదట హమాసే. ఇందులో ఏ మాత్రం అబద్ధం లేదు. అయితే ప్రపంచంలో టాప్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ కలిగిన ఇజ్రాయెల్ ముందుగా హమాస్ దాడులను పసిగట్టలేకపోయిందా అంటే ఆశ్చర్యం కలగకమానదు. నిజానికి ఇది అక్టోబర్ 7న మొదలవ్వలేదు. 1948 నుంచే ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వైరం ఉంది. నాడు నక్బా పేరుతో జరిగిన ఊచకోతలో 15వేల మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు. ఇక ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్ ప్రాంతాలపైనే హమాస్ రాకెట్‌లతో విరుచుకుపడింది. అది ఒకప్పటి పాలస్తీనా నేలే.. దాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తర్వాత మధ్యలో గొడ కట్టింది. ఆ గొడను దాటి హమాస్ సైనికులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి వందలాది మంది అమాయకులను చంపేశారు.
వాస్తవానికి ఈ ఘటన జరిగిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూపై సొంతదేశంలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఆయన తన పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న రోజులవి. అలాంటి సమయంలో మొత్తం ఇజ్రాయెల్ ప్రజల డైవర్షన్ హమాస్‌వైపు వెళ్లింది. ఆ తర్వాత ప్రతీకార చర్య సాకుతో గాజా గడ్డపై ఇజ్రాయెల్ బలగాలు రాకెట్లతో విరుచుకుపడ్డాయి. హమాస్ దళాలు ఉన్నారన్న అనుమానాలతో ఆస్పత్రులపైనా దాడులకు దిగాయి. రిలీఫ్ క్యాంపులపైనా బాంబుల వర్షం కురిపించాయి. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవాళ పాలస్తీనా ప్రజలకి కనీసం ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్తు, వైద్యం ఏమీ అందడం లేదు. మురుగు నీరు తాగుతున్నారు. ఆకలికి మాడి అలమటిస్తున్నారు. కంటి నిండా నిద్ర లేదు. కడుపులో తిండి లేదు. వాళ్లని ఏ దేశమూ పట్టించుకోవడం లేదు. మానవహక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని కబుర్లు చెప్పే పశ్చిమ దేశాలు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాయ్.
ఇక ఇవాళో, రేపో యుద్ధం ఆగుతుందని చెబుతున్నారు కానీ.. ఇప్పుడిప్పుడే ఈ రక్తప్రవాహం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఓవైపు ట్రంప్ ఓ శాంతి ప్రణాళిక రచించారు. దాన్ని పాటిస్తామని ఇజ్రాయెల్ చెప్పింది. అయితే ఇజ్రాయెల్ ఆ పని చేయలేదు. ట్రంప్ శాంతి సూత్రాలను పాటిస్తామని చెబుతునే మరోవైపు గాజా గడ్డపై బాంబులతో విరుచుకుపడింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ యుద్ధం ఇప్పుడే ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇక గత జనవరిలోనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. అప్పుడే యుద్ధం ఆగుతుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కూడా కొనసాగింది.
నిజానికి యుద్ధం అంటేనే హత్యలు! యుద్ధం అంటేనే నీచత్వం, క్రూరత్వం..! యుద్ధమంటనే భీభత్సం, విధ్వంసం, వినాశనం, మానవ హననం..! ఎదుటి మనిషి ప్రాణాలు తీయడం, ప్రాణాలు పోగొట్టుకోవడం, మనిషిని మనిషి చంపుకోవడం ఎంత దుర్మార్గం? మానవ సమాజానికి యుద్ధాన్ని మించిన ఉన్మాదం, అనాగరికం, భయానకం, ప్రమాదకరం మరేదీ లేదు. ఈ విషయం అటు ఇజ్రాయెల్‌కి, ఇటు హమాస్‌కి తెలియనిది కాదు.. అయినా వారు యుద్ధాన్ని ఆపడంలేదు. మరి చూడాలి..ఈ యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో, ఇంకెంతమంది అమాయకులను బలి తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి
