Let's talk: editor@tmv.in
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం సాధించారు?: రామచందర్ రావు

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం సాధించారు?: రామచందర్ రావు

Gaddamidi Naveen
3 ఫిబ్రవరి, 2026

గత రెండేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అబద్ధపు హామీలు, నకిలీ గ్యారంటీలతో మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ ఆశిష్ షెలార్ చేతుల మీదుగా కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఒక 'ఛార్జ్‌షీట్' విడుదల చేసింది.

ముఖ్యంగా బీసీ వర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహం క్షమించరానిదని రాంచందర్ రావు అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు జరగలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కాలేదని విమర్శించారు. అలాగే కాంట్రాక్టులు, పనుల్లో బీసీలకు రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్ కింద రూ.20 వేల కోట్ల కేటాయింపులు లేవని పేర్కొన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ, బీసీ కార్పొరేషన్లు, వడ్డీ లేని రుణాలు, ప్రొఫెసర్ జయశంకర్ భవన్ వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. ప్రతి మండలంలో గురుకులాలు, ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలు, మెగా స్కీమ్ ఫేజ్-2 వంటి అంశాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయ‌న‌ తెలిపారు.

పారిశ్రామిక అభివృద్ధి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ప్రారంభించలేదని, భద్రాచలం, ఆసిఫాబాద్‌లలో తేనె పరిశోధన కేంద్రాలు, నాగర్, కర్నూలు, జగిత్యాలలో లాక్ ఇన్సెక్ట్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు కాలేదన్నారు. అలాగే ఎన్.హెచ్-44పై ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అమలు కాలేదని ఆయ‌న ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఖటా ఖట్ అంటూ ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్, రెండేళ్ల పాలనలో ఇచ్చింది మాత్రం ధోఖా మాత్రమేనని రాంచందర్ రావు విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ ఆశిష్ శేలార్ చేతుల మీదుగా కాంగ్రెస్ తప్పుడు హామీలను బహిర్గతం చేస్తూ బీజేపీ చార్జిషీట్ విడుదల చేసిందని ఆయన తెలిపారు. ప్రజలు నిజాలను గమనించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.