Let's talk: editor@tmv.in
రెండేళ్లలో స్కూల్ బస్సులు ఎలక్ట్రిక్‌కి మారాలి: ఢిల్లీ ప్రభుత్వం

రెండేళ్లలో స్కూల్ బస్సులు ఎలక్ట్రిక్‌కి మారాలి: ఢిల్లీ ప్రభుత్వం

Panthagani Anusha
12 ఏప్రిల్, 2026

దేశ రాజధానిలో కాలుష్య కోరల నుంచి విద్యార్థులకు విముక్తి కలిగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే ధ్యేయంగా పాఠశాల బస్సులను దశలవారీగా విద్యుదీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన కొత్త ఈవీ విధానం ప్రకారం ప్రైవేటు పాఠశాలలు తమ వద్ద ఉన్న మొత్తం బస్సుల్లో కనీసం 10 శాతాన్ని రెండేళ్లలోపు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది.

దశలవారీగా అమలు

ప్రభుత్వం ప్రకటించిన ఈ లక్ష్యాలు పాఠశాల యాజమాన్యాలకు స్పష్టమైన గడువును నిర్దేశించాయి. విధానం అమల్లోకి వచ్చిన తొలి రెండు ఏళ్లలో కనీసం 10 శాతం బస్సులు ఈవీలుగా మారాలి. మూడో ఏడాది నాటికి ఈ కోటాను 20 శాతానికి పెంచి 2030 మార్చి 31 నాటికి మొత్తం బస్సుల సంఖ్యలో 30 శాతం తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా కేవలం పాఠశాల సొంత బస్సులకే కాకుండా అద్దె ప్రాతిపదికన నడిపే వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది.

విద్యాశాఖ పర్యవేక్షణలో కఠిన నిబంధనలు

ఈ నూతన విధానం అమలును విద్యాశాఖ నేరుగా పర్యవేక్షించనుంది. రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటూ, ఏయే పాఠశాలలు నిబంధనలు పాటిస్తున్నాయో ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. కేవలం వాహనాల మార్పుకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ముప్పులు, విద్యుత్ ఆదా ప్రాముఖ్యతపై విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.

పాత విధానానికి కొనసాగింపుగా

ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా 2020 ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ విధానం గడువు 2023లో ముగిసినప్పటికీ ఇప్పటివరకు దానిని పొడిగిస్తూ వచ్చారు. ఇప్పుడు మరింత పటిష్టమైన లక్ష్యాలతో 2026-2030 కాలానికి కొత్త ముసాయిదాను సిద్ధం చేశారు. పాఠశాల బస్సుల ఎలక్ట్రిఫికేషన్ ద్వారా నగరంలో వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ముసాయిదా ప్రతిపాదనలను రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనిపై ప్రజలు, పాఠశాల యాజమాన్యాలు నిపుణులు తమ అభిప్రాయాలను సూచనలను 30 రోజుల్లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం అవసరమైన మార్పులతో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాజధానిలో పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన ప్రయాణ అలవాట్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు.