Let's talk: editor@tmv.in
రెండేళ్లలో ఏపీ అక్షరాస్యత 72.6 నుంచి 82.1 శాతానికి: మంత్రి లోకేశ్‌
రెండేళ్లలో ఏపీ అక్షరాస్యత 72.6 నుంచి 82.1 శాతానికి: మంత్రి లోకేశ్‌
రెండేళ్లలో ఏపీ అక్షరాస్యత 72.6 నుంచి 82.1 శాతానికి: మంత్రి లోకేశ్‌

రెండేళ్లలో ఏపీ అక్షరాస్యత 72.6 నుంచి 82.1 శాతానికి: మంత్రి లోకేశ్‌

Gaddamidi Naveen
3 సెప్టెంబర్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. 2024లో 72.6 శాతంగా ఉన్న రాష్ట్ర అక్షరాస్యత రేటు 2026 నాటికి 82.1 శాతానికి చేరిందని వెల్లడించారు. ‘అక్షరాంధ్ర’ కార్యక్రమం ద్వారా సాధించిన ఈ పురోగతి చారిత్రాత్మకమని పేర్కొంటూ అధికారులు, ఉపాధ్యాయులు, కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేదని లోకేశ్‌ గుర్తుచేశారు. 2024లో రాష్ట్ర అక్షరాస్యత 72.6 శాతంగా ఉండగా, బిహార్‌లో 74.3 శాతం నమోదైందన్నారు. కేవలం రెండేళ్లలోనే రాష్ట్ర అక్షరాస్యత జాతీయ సగటు 81 శాతాన్ని అధిగమించడం పెద్ద మార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం 2025లో ప్రారంభించిన ‘అక్షరాంధ్ర’ కార్యక్రమం ఈ పురోగతిలో కీలక పాత్ర పోషించిందని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 25 లక్షల మందికి అక్షరాస్యత కల్పించినట్లు పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షల ఫలితాల్లోనూ రాష్ట్ర అక్షరాస్యత రేటు దాదాపు 10 శాతం పాయింట్లు పెరిగినట్లు వెల్లడైంది.

ఈ పురోగతిని కొనసాగిస్తూ 2027 సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలని లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం దశలవారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 25 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని, అనంతరం మిగిలిన 27 లక్షల మందిని సెప్టెంబరు 2027 నాటికి అక్షరాస్యులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

‘అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి, అక్షరాస్యతపై అవగాహన, ప్రజల సమీకరణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని మంత్రి సూచించారు.

ఇదిలా ఉండగా, పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో పాఠశాల వయసున్న ప్రతి చిన్నారిని గుర్తించి తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని లోకేశ్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.64 లక్షల మందికి పైగా పాఠశాల వయసున్న పిల్లలు అధికారిక విద్యా వ్యవస్థకు వెలుపల ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో సుమారు 33 వేల మందిని ఈ ఏడాది పాఠశాలల్లో చేర్పించినట్లు వెల్లడించారు. మిగిలిన పిల్లల వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతంగా ఉండగా, విద్యార్థుల హాజరు 85.4 శాతంగా ఉంది. విద్యార్థుల హాజరును మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

జేఎన్‌టీయూకేలో కొత్త హాస్టళ్లు ప్రారంభం

పల్నాడు జిల్లాలో మంత్రి లోకేశ్‌ బుధవారం పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, కాకినాడ (జేఎన్‌టీయూకే) యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు వసతి గృహాలను మంత్రి ప్రారంభించారు.

విద్యార్థినీ, విద్యార్థుల కోసం గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన ఈ హాస్టల్‌ భవనాలకు సంబంధించిన శిలాఫలకాన్ని లోకేశ్‌ ఆవిష్కరించారు. కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి హాస్టళ్లను ప్రారంభించిన ఆయన.. భవనాలను, అక్కడ కల్పించిన వసతులను పరిశీలించారు.

సుమారు రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వసతి కల్పించేలా ఈ నూతన హాస్టల్‌ భవనాలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతి సౌకర్యాలు అందించడంలో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ వి.సంజనా సిమ్హా, జేఎన్‌టీయూకే వైస్‌ ఛాన్సలర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.