
రెండేళ్లలో ఉద్యోగ భర్తీ లేదు…జాబ్ క్యాలెండర్ పచ్చి మోసం: వైఎస్ షర్మిల
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం నిలువునా వంచించిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కేవలం 'కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు' ఉందని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా ఊరించి చివరకు ఉసూరుమనిపించడం చంద్రబాబు సర్కార్‌కే చెల్లిందని విమర్శించారు. కేవలం పది వేల పోస్టులతో షెడ్యూల్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
హామీలు బూడిదలో పోసిన పన్నీరేనా?
ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాతా వివిధ శాఖల మంత్రులు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని షర్మిల ప్రశ్నించారు. విద్యాశాఖలో 30 వేల బోధన, బోధనేతర పోస్టులు, పోలీస్ శాఖలో భర్తీ చేస్తామన్న 19,999 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలోని 20 వేల ఖాళీల ప్రస్తావన జాబ్ క్యాలెండర్‌లో ఎందుకు లేదని నిలదీశారు. అదేవిదంగా పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, వైద్య శాఖల్లో కలిపి లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్లు గతంలో లెక్కలు చెప్పి ఇప్పుడు వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు.
దేశంలోనే నిరుద్యోగంలో ప్రథమ స్థానం
రాష్ట్రంలో 153 విభాగాల పరిధిలో సుమారు 1.80 లక్షల ఖాళీలు ఉన్నాయి. కనీసం ఏటికేటా 20 శాతం చొప్పున భర్తీ చేసినా ఈ రెండేళ్లకు కలిపి 50 వేల ఉద్యోగాలైనా ఇవ్వాలి కదా? అని ఆమె ప్రశ్నించారు. దేశంలోనే నిరుద్యోగితలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండటం గమనార్హమని దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్ముకుని కోచింగ్ సెంటర్లలో లక్షలు పోస్తున్న నిరుద్యోగ బిడ్డలకు ఈ పది వేల పోస్టులు ఎలా సరిపోతాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వయోపరిమితి పెంపు ఏమైంది?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యర్థుల వయోపరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. పదో పరకో పోస్టులతో సరిపెట్టకుండా భారీ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. యువతను నమ్మించి నయవంచన చేస్తే సహించేది లేదని నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు.
