Let's talk: editor@tmv.in
రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?: కేటీఆర్

రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?: కేటీఆర్

Gaddamidi Naveen
4 ఆగస్టు, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న యువత తీవ్ర నిరాశలో ఉందని, ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో నియామకాలు జరగలేదని విమర్శించారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన వేణు అనే యువకుడు ఉద్యోగాలు రాకపోవడంతో రాహుల్ గాంధీకి ఉద్దేశించి లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు ప్రాణాలతో పోరాడుతున్నాడని, ఆ యువకుడి లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు. మధిర నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమని గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ కోచింగ్ సెంటర్ల ప్రాంతానికి వచ్చి యువతకు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడు వారి సమస్యలపై స్పందించేందుకు ఎందుకు రావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చిన్న ఘటన జరిగినా పరిగెత్తుకెళ్లే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో లాఠీఛార్జీలు జరుగుతున్నా, నిరుద్యోగులు బలివుతున్నా ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. తెలంగాణ యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం పాటించడం సమంజసం కాదన్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రాకపోతే తెలంగాణ యువతతో కలిసి ఢిల్లీలోని ఆయన నివాసం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ పట్టభద్రులను ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తప్పుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న తెలంగాణ ఇంజినీర్లను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లు, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించింది ఇంజినీర్లేనని గుర్తుచేశారు. యువతను అవమానించేలా వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై చేసిన వ్యాఖ్యలు కూడా అనుచితమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో వేలాది ఉద్యోగాలు తగ్గిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని, గురుకులాల్లో జరిగిన ఘటనలు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

సాగునీటి అంశంపైనా కేటీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల ద్వారా రైతులకు అందించకుండా వందల టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని, రైతులకు నీరు అందించే చిత్తశుద్ధి కూడా లేదని విమర్శించారు. మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. మెట్రోను టేకోవర్ చేయడం వెనుక భారీ భూకుంభకోణం ఉందని, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం 16,978 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్లు పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు. అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన పోస్టులను మినహాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా భర్తీ చేసిన ఉద్యోగాలు 10 వేలకూ చేరలేదని ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి 70 వేల ఖాళీలను భర్తీ చేసిందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.