
రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?
కవిత రాజకీయంగా మరోసారి దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే తాజాగా ఆమె నిరుద్యోగుల సమస్యలను లేవనెత్తారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఆందోళనలు చేపట్టి.. ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. నిజానికి నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురైంది బీఆర్ఎస్ పాలనలోనే.. మరి కవిత ఆ సమయంలో ఎంపీగా ఉన్నారు. ఆమె తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మరి అప్పుడు ప్రభుత్వాన్ని సూచనప్రాయంగా ఒక్క మాట కూడా అడగని కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
కాంగ్రెస్ చెప్పిందేంటి? చేసిందేంటి?
ప్రతి రాజకీయపార్టీ నిరుద్యోగులను ఆశలపల్లకిలో ఊరేగిస్తూ ఉంటుంది. గతంలో తెలంగాణ ఉద్యమసమయంలోనూ నిరుద్యోగులే బీఆర్ఎస్ పార్టీకి ఆయుధాలయ్యారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అది అమలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులనే వాడుకున్నది. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీ అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. దీన్నే విపక్షాలు ఆయుధంగా వాడుకుంటున్నాయి. అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ నిరుద్యోగులే రాజకీయంగా సమిధలు అవుతుండటం గమనార్హం.
గన్‌పార్క్ వద్ద కవిత ఆధ్వర్యంలో నిరసన
బుధవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఆందోళన జరిగింది. నిరుద్యోగుల సమస్యలు, గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలపై నిరుద్యోగులు ప్రశ్నించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత గన్ పార్క్‌లో ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. 'రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. కానీ వారినే మోసం చేశారు' అంటూ ఆరోపణలు చేశారు. హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ మూల్యాంకనం లేదా పరీక్ష ఆదేశించడం.
నిరుద్యోగుల మద్దతు
గన్ పార్క్‌లో జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి కవిత ధర్నా చేపట్టారు. 'గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయి. రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి' అంటూ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో నిరుద్యోగుల ఓట్లు అడిగారని.. ఇప్పుడేమో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని కవిత ప్రశ్నించారు. పాత నోటిఫికేషన్లతోనే నియామకాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
కవిత వ్యూహమేంటి?
కవిత రాజకీయంగా నిలదొక్కుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి సొంతపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కవిత ఇప్పుడు కొత్త నినాదాలను తెరమీదకు తీసుకొస్తున్నది. సామాజిక తెలంగాణ, నిరుద్యోగ సమస్యలు వంటి సమస్యలను లేవనెత్తి ఆయా వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి కవిత వ్యూహం ఫలిస్తుందా? ఆమెను ప్రజలు నమ్ముతారా? అన్నది భవిష్యత్‌లో తేలనున్నది.
రాజకీయ లక్ష్యంతోనేనా?
బీఆర్ఎస్ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నది కాంగ్రెస్ ఆరోపణ. అయితే అప్పట్లో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఏనాడు కవిత వారి పక్షాన కొట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆమెకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి కాబట్టి నిరుద్యోగుల మద్దతు కావాల్సి వచ్చిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే కవిత ఆ సమస్యను లేవనెత్తింది కాబట్టి కనీసం ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని కొందరు నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఉద్యోగాలు ఎన్ని?
తెలంగాణలో నిరుద్యోగ సమస్య మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2025 ఆగస్టు నాటికి యువతలో నిరుద్యోగ రేటు 20.1% ఉందని కేంద్ర ప్రభుత్వ పీఎల్ఎఫ్ఎస్ (పీరియాడికి లేబర్ ఫోర్స్ సర్వే) రిపోర్ట్ చెబుతోంది. ఇది దేశవ్యాప్త సగటు 15.6% శాతం కంటే ఎక్కువ. దీంతో సహజంగానే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ తొమ్మిదేండ్లే పాలనలో మొత్తం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు అప్పటి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో గ్రూప్1, 2, 3 పోస్టులు కలిపి 30,500 దాకా ఉన్నాయి. పోలీస్ శాఖలో 31,900 ఉద్యోగాలు ఉన్నాయి. విద్యాశాఖ 45 వేల ఉద్యోగాలు ఉన్నాయి. మిగిలినవి ఇతర శాఖల్లోని ఉద్యోగాలు. అయితే సగటున సంవత్సరానికి సుమారు 16,000 ఉద్యోగాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం 4 లక్షల పైచిలుకు ఐటీ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్నారు. అయితే అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగ కల్పన విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యింది. బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగులు కూడా కారణమయ్యారు. అప్పట్లోనే కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని?
కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో (డిసెంబర్ 2023 - అక్టోబర్ 2025) 65 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేామని ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్ల జారీ చేసినవే ఉన్నాయని.. వాటికే నియామక పత్రాలు అందజేశారని విమర్శలు ఉన్నాయి. మొత్తంగా ఈ సమస్య రాజకీయంగా వివాదం రేపింది.
