Let's talk: editor@tmv.in
రెండు రోజులు…. ఎనిమిది మరణాలు

రెండు రోజులు…. ఎనిమిది మరణాలు

Panthagani Anusha
12 అక్టోబర్, 2025

ఆర్థిక కష్టాలు, వైవాహిక కలహాలు రాజస్థాన్‌లో ఊహించని విషాదాలను మిగిల్చాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని జైపూర్,సికర్ జిల్లాల్లో రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది బలవన్మరణానికి పాల్పడటం స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురి మృతి

రాజధాని జైపూర్‌లోని కర్ణి విహార్‌లో జరిగిన ఘటనలో, రూపేంద్ర శర్మ (63), సుశీల శర్మ (58) దంపతుల సహా వారి కుమారుడు పుల్కిత్ శర్మ (32) విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి వీరు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇంటి యజమాని ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించిన తరువాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కర్ణి విహార్ ఎస్‌హెచ్‌ఓ హవా సింగ్ ప్రాథమిక విచారణలో, శర్మ కుటుంబం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని, అప్పుల బాధ భరించలేక ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

కుటుంబ కలహాలతో తల్లి సహా నలుగురు పిల్లల ఆత్మహత్య

సికర్‌లో అంతకంటే దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భర్తతో తరచూ తలెత్తే కుటుంబ వివాదాల కారణంగా కిరణ్ (35), అనే మహిళా తన నలుగురు పిల్లలతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు తెలియజేశారు.

సికర్‌ సదర్ ఎస్‌హెచ్‌ఓ ఇంద్రజ్ మరోడియా బృందం అక్కడికి చేరుకుని తలుపులు తెరిచిచూడగా రూమ్ లో కిరణ్‌తో పాటు ఆమె ముగ్గురు కుమారులు సుమిత్ (18), ఆయుష్ (4), అవినాష్ (3),కూతురు స్నేహ (13) మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. వీరంతా రెండు నుంచి మూడు రోజుల క్రితమే విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మృతురాలి బంధువులకు సమాచారం అందించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ఘటనలు సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆర్థిక అస్థిరతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు బాధిత కుటుంబాల పరిస్థితులను సమీక్షిస్తూ మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా కుటుంబ విభేదాలు, అప్పుల ఒత్తిడి వంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఒంటరితనంలో కాకుండా, సలహా కేంద్రాలు లేదా స్నేహితుల సహాయం తీసుకోవడం ద్వారా ఇలాంటి దారుణ సంఘటనలను నివారించవచ్చని పేర్కొన్నారు.