
రెండు నెలలకు ఒకసారి కాకినాడ పర్యటన: పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రత్యేక పర్యటనలు నిర్వహించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. రహదారుల పరిస్థితిపై ప్రత్యేకంగా స్పందించిన ఆయన జిల్లాలో ఏ ఒక్క రోడ్డుపై గుంతలు కనబడకూడదని స్పష్టం చేశారు. పూర్తిగా దెబ్బతిన్న రహదారులను పునర్నిర్మించడమే కాకుండా చిన్న గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల నాణ్యతను మెరుగుపర్చాలని అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ నిరంతరం సమీక్షించాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ గ్రామస్థాయిలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రీడలు, కళలు, శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని గ్రంథాలయాలను బలోపేతం చేయాలని సూచించారు.
ఇక పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా చెట్ల నాటకం చేపట్టి, వర్షాకాలానికి ముందే తీరప్రాంతం వెంబడి “గ్రేట్ గ్రీన్ వాల్” ప్రాజెక్టును పూర్తి చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు.
ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీకి సూచించారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
