Let's talk: editor@tmv.in
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్

Panthagani Anusha
1 మార్చి, 2026

మహిళా ఆరోగ్య సంరక్షణనే లక్ష్యంగా ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్‌ను (సెర్వికల్ క్యాన్సర్) ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకమైన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కింగ్ కోటి ఆసుపత్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజనరసింహ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.కాగా రాష్ట్ర వ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల వయస్సు గల సుమారు 3.5 నుంచి 4 లక్షల మంది బాలికలకు ఈ టీకాలు వేయడమే లక్ష్యంగా మూడు నెలల ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. మొదటి నెలలో జిల్లా, ఏరియా ఆసుపత్రులు మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉండగా తదుపరి దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు. మార్కెట్‌లో రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు ధర పలికే ‘గార్డసిల్’ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 60 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అందులో గర్భాశయ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఏటా సుమారు 3,200 మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారని దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా రావివలసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. కాగా ఏపీలో సుమారు 3.4 లక్షల మంది బాలికలకు ఈ టీకా ప్రయోజనం చేకూరనుంది. గర్భాశయ క్యాన్సర్‌ను రాకముందే నివారించేందుకు ఈ టీకా అత్యంత కీలకమని మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి అర్హులైన ప్రతి బాలికకు టీకా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో ప్రారంభమైన ఈ భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే హెచ్‌పీవీ టీకా తీసుకోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ ముప్పును 90 శాతం వరకు నివారించవచ్చని వారు సూచిస్తున్నారు.