
రూ.75 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, కానిస్టేబుల్
కేసు దర్యాప్తులో సహకరించి చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటూ చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం రాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లగండ్లలోని 431 గజాల స్థలానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు చందానగర్ ఠాణా ఎస్‌ఐ బండెల బాలరాజ్, కానిస్టేబుల్ బి.రాఘవేంద్ర లంచం డిమాండ్ చేశారు.
బాధితుడి ఫిర్యాదుదారుడి మేరకు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు శనివారం పీఎస్‌లో తనిఖీలు చేపట్టారు. ఫిర్యాదుదారుడి నుంచి ఎస్‌ఐ రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. లంచం మొత్తాన్ని ఎస్‌ఐ కార్యాలయంలోని టేబుల్ డ్రాలో నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే ఎస్‌ఐ రూ.20 వేల నగదును, కానిస్టేబుల్ ఆన్‌లైన్ ద్వారా రూ.10 వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిన నిందితులిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
