
రూ.590 కోట్ల విన్జో గ్రూప్ ఆస్తుల స్వాధీనం: ఈడీ
ఈడీ విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), 1999 కింద విన్జో ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ జో ప్రైవేట్ లిమిటెడ్ లకు చెందిన బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు కలిపి సుమారు రూ.590 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడీ ప్రకారం, విన్జో రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ), ఆన్‌లైన్ జూద కార్యకలాపాల్లో నిమగ్నమై, బింగో 2పీ, బింగో టర్బో, లూడో, స్నేక్స్ అండ్ లాడర్స్, మైన్స్, సాలిటైర్, స్పేడ్స్, బ్లాక్ జాక్ తదితర 100కి పైగా గేమ్‌లను నిర్వహిస్తోంది. సంస్థకు సుమారు 25 కోట్ల యూజర్ బేస్ ఉందని పేర్కొంది. విన్జో తన విదేశీ అనుబంధ సంస్థలైన వింజో యూఎస్ ఐఎన్సీ(అమెరికా), వింజో ఎస్జీ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్)లో యూఎస్డీ 54,255,010 (సుమారు రూ.492 కోట్లు) మేరకు విదేశీ మారకాన్ని వినియోగించి ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లు ఈడీ తెలిపింది.
ఈడీ బెంగళూరు జోనల్ కార్యాలయం ఫెమా చట్టంలోని సెక్షన్ 37ఏ కింద ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. సెక్షన్ 4 కింద ఉల్లంఘనలు జరిగినట్లు సంస్థ పేర్కొంది. ఈడీ ఆరోపణల ప్రకారం, విన్జో తన అమెరికా అనుబంధ సంస్థ ద్వారా బ్రెజిల్, జర్మనీ, అమెరికాలో రియల్ మనీ గేమింగ్ (ఆన్‌లైన్ జూదం) నిర్వహిస్తోంది. విదేశాల్లో ఓడీఐ పేరిట నిధులను నిల్వ ఉంచినప్పటికీ, ఆ కార్యకలాపాల కోసం అవసరమైన పూర్తి గేమింగ్ మౌలిక వసతులు భారత్ నుంచే పంచుకుని నియంత్రిస్తుతున్నాయని తెలిపింది.
విదేశీ సంస్థలకు అక్కడ స్వతంత్ర ఉద్యోగులు లేదా కార్యాలయ స్థావరాలు లేవని, వాటి పూర్తి నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలు భారత్‌లోని డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలోనే ఉన్నాయని ఈడీ పేర్కొంది. అమెరికా, సింగపూర్ సంస్థల అకౌంటింగ్ రికార్డులు, విదేశీ బ్యాంక్ ఖాతాల నిర్వహణ వంటి ఆర్థిక వ్యవహారాలు కూడా భారత్ నుంచే నిర్వహిస్తున్నాయని వెల్లడించింది. అదనంగా ‘కాల్ బ్రేక్’గేమ్‌ను లైసెన్స్ రూపంలో విన్జో ఇండియాకు ఇచ్చి, విన్జో సింగపూర్ లైసెన్సింగ్ ఫీజు పొందుతోందని ఈడీ తెలిపింది. విన్జో గ్రూప్ ఒక భారతీయ గేమింగ్ స్టార్టప్. దీన్ని పవన్ నందా, సౌమ్య సింగ్ రాథోర్ 2018లో స్థాపించారు.
2022 నాటి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ (ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్) రూల్స్‌లోని రూల్ 19(1)(బి) ప్రకారం నిషేధిత కార్యకలాపాలైన జూదం, రియల్ మనీ గేమ్స్ నిర్వహణ కోసం 100 శాతం అనుబంధ సంస్థలను అమెరికా, సింగపూర్‌లో స్థాపించడం చట్టవిరుద్ధమని ఈడీ ఆరోపించింది. రూల్ 9(1) కింద కూడా అవి నాన్-బోనాఫైడ్ వ్యాపార కార్యకలాపాలుగా పరిగణిస్తాయని పేర్కొంది. అలాగే ప్రమోషన్ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్, 2025 (పీఆర్వోజీ చట్టం), 2025 ప్రకారం ఆన్‌లైన్ గేమ్స్ భారత్‌లో నిషేధించిన నేపథ్యంలో, విన్జో విదేశీ పెట్టుబడులు పెట్టడం లేదా కొనసాగించడం అనుమతించదని ఈడీ తెలిపింది. నిషేధిత కార్యకలాపాల ద్వారా విదేశాల్లో సంపాదించిన విదేశీ కరెన్సీ, ఆదాయాన్ని అమెరికా, సింగపూర్ అనుబంధ సంస్థల బ్యాంక్ ఖాతాల్లో నిల్వ ఉంచడం ఫెమా సెక్షన్ 4 ఉల్లంఘనగా పరిగణించిందని, దాదాపు రూ.590 కోట్ల మేర ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఇటీవలే విన్జో యాప్ కేసులో అమెరికా, సింగపూర్‌లో ఉన్న విదేశీ షెల్ కంపెనీల ఖాతాల్లో ఉన్న యూఎస్డీ 55.69 మిలియన్ (సుమారు రూ.505 కోట్లు) మొత్తాన్ని కూడా ఈడీ అటాచ్ చేసిన విషయం గమనార్హం.
