Let's talk: editor@tmv.in
రూ.5,083 కోట్ల ఒప్పందాలకు రక్షణశాఖ ఆమోదం

రూ.5,083 కోట్ల ఒప్పందాలకు రక్షణశాఖ ఆమోదం

Pinjari Chand
4 మార్చి, 2026

రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం రూ.5,083 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలకు ముద్ర వేసింది. ఇందులో ఆరు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్) కొనుగోలు చేయడంతో పాటు సర్ఫెస్-టు-ఎయిర్ క్షిపణుల సమీకరణ కూడా ఈ ఒప్పందంలో ఉండనుంది.

కోస్ట్ గార్డ్‌కు హెలికాప్టర్లు

అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు ఎంకే-III (మారిటైమ్ రోల్) హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన రూ.2,901 కోట్ల ఒప్పందాన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో కుదుర్చుకుంది. ఈ ట్విన్-ఇంజిన్ హెలికాప్టర్లు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడి, తీరప్రాంత భద్రతా మిషన్లు, సముద్రంలో నౌకలపై నుంచే ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ హెలికాప్టర్ల ప్రవేశంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ సామర్థ్యం మరింత బలపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కృత్రిమ దీవులు, ఆఫ్‌షోర్ ఇన్‌స్టాలేషన్లు, మత్స్యకారులు, సముద్ర పర్యావరణ రక్షణలో వీటి పాత్ర కీలకంగా మారనుంది.

నౌకాదళానికి ష్టిల్ క్షిపణులు

రూ.2,182 కోట్ల విలువైన సర్ఫెస్-టు-ఎయిర్ వర్టికల్ లాంచ్ ‘ష్టిల్’ క్షిపణుల కొనుగోలుకు జేఎస్‌సీ రోసోబోరోనెక్స్‌పోర్ట్‌తో ఒప్పందం కుదిరింది. ఈ క్షిపణులు ఇండియన్ నేవీ ముందుండే నౌకాదళ యుద్ధనౌకలపై అమర్చుతారు. ఈ వ్యవస్థతో వైమానిక ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమవుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్–రష్యాల మధ్య ఉన్న దీర్ఘకాల రక్షణ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం మరోసారి ప్రతిబింబిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు.