
రూ.5కే టిఫిన్, భోజనం.. హైదరాబాద్‌లో మరో 2 చోట్ల ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం 'ఆకలి లేని హైదరాబాద్' లక్ష్యంగా నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరిస్తోంది. ఈ క్యాంటీన్లలో పేదలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల సౌకర్యార్థం ఉదయం రూ.5కే నాణ్యమైన అల్పాహారం (టిఫిన్), మధ్యాహ్నం రూ.5కే మంచి భోజనం అందిస్తున్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని రెండు ముఖ్య ప్రాంతాల్లో శుక్రవారం కొత్తగా ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. బాగ్ లింగంపల్లి-సుందరయ్య పార్క్ వద్ద (సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో), కవాడిగూడ-ఎన్టీపీసీ వద్ద ఈ క్యాంటీన్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, అధికారులు లబ్ధిదారులతో కలిసి టిఫిన్ చేసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఉపాధి కోసం నగరానికి వచ్చే సామాన్య ప్రజలు, పేదలు, కూలీలు, అల్పాదాయ వర్గాల వారికి ఈ క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇంకా ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరమో ప్రభుత్వం గుర్తిస్తోందని, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరిన ప్రాంతాల్లో కూడా వీటిని త్వరలో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఆకలి బాధలు లేని హైదరాబాద్‌ను చూడాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఈ క్యాంటీన్లను పూర్తి స్థాయిలో నగరమంతా అందుబాటులోకి తేనుంది. ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ పౌండేషన్ చూస్తుందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో పాటు స్థానిక కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
