
రూ.2.82 కోట్ల బంగారు బిస్కెట్లు పట్టివేత
కొన్నేళ్లుగా దేశ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా (స్మగ్లింగ్) కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం, డ్రగ్స్, నకిలీ కరెన్సీ, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అక్రమ రవాణా ప్రయత్నాలు నిరంతరంగా కొనసాగుతుండటంతో భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) మరోసారి తమ కట్టుదిట్టమైన నిఘాతో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఇండో–బంగ్లా సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ సిబ్బంది రాత్రి వేళల్లో నిర్వహించిన స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్‌లో అక్రమంగా బంగారు బిస్కెట్లను ఇతర దేశంలోకి తరలించే ప్రయత్నం చేసిన ఒక అంతర్జాతీయ స్మగ్లర్‌ను అరెస్ట్ చేసింది. అతడి వద్ద నుంచి రూ. 2.82 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
సాధారణ తనిఖీల్లో భారీ స్వాధీనం
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సరిహద్దు ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగాకనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా అతడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు దీంతో జవాన్లు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అతని దగ్గరున్న బ్యాగ్, దుస్తులు షూలను తనిఖీ చేయగా అతను అక్రమంగా తరలిస్తున్న బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి.
దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఎస్‌ఎఫ్ అంచనా ప్రకారం స్వాధీనం చేసిన బంగారం బరువు సుమారు 4.5 కిలోలుగా, మార్కెట్ విలువ రూ. 2.82 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ బంగారం బంగ్లాదేశ్ నుండి సరిహద్దు దాటించి కోల్‌కతా లేదా ఢిల్లీ మార్కెట్‌కు తరలించాలన్న ఉద్దేశ్యంతో వచ్చారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడింది.
ఇక అరెస్టు చేసిన స్మగ్లర్‌ను బీఎస్‌ఎఫ్ అధికారులు స్థానిక పోలీసు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అతని నుండి దొరికిన బంగారం, నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. స్మగ్లింగ్ను కూకటి వేళ్ల నుంచి తుడిచేయడమే లక్ష్యంగా బీఎస్‌ఎఫ్ దళాలు పని చేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇకపోతే ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్రాల గుండా ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, బీఎస్‌ఎఫ్ ఆధునిక పరికరాలతో గస్తీని మరింత బలోపేతం చేసిందని, రాత్రి సమయంలో డ్రోన్లు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు, బీఎస్‌ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ విజయంతో స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లకు బీఎస్‌ఎఫ్ మరోసారి గట్టి హెచ్చరిక ఇచ్చినట్టయింది.
