
రూ.2,758 కోట్ల విద్యుత్ చార్జీలు ట్రూడౌన్ చేయాలి: సిపిఎం
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తుది నిర్ణయం ప్రకారం రూ. 923 కోట్లు మాత్రమే కాకుండా 2024-25 కాలానికి అక్రమంగా వసూలు చేసిన మొత్తం ట్రూఅప్ ఛార్జీలు రూ.2,758 కోట్లు వినియోగదారులకు వాపసుచేయాలని (ట్రూడౌన్) సిపిఐ (ఎం) జిల్లా కమిటి కార్యదర్శి పి. అప్పల నరస డిమాండ్ చేశారు.
2024-25 కాలానికి సంబంధించి 923 కోట్ల రూపాయలు ట్రూ డౌన్ ద్వారా, ఇప్పుడు వినియోగించుకుంటున్న విద్యుత్‌పై యూనిట్‌కు 13 పైసలు చొప్పున సంవత్సర కాలంలో తిరిగి వినియోగదారులకు చెల్లించాలని నియంత్రణ మండలి ఆదేశాలు ఇవ్వటం సరైనదే అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ప్రతి నెల వినియోగించుకున్న యూనిట్‌పై తదుపరి నెల బిల్లులలో 40 పైసలు చొప్పున ముందుగానే 2758 కోట్ల రూపాయలు వినియోగదారుల వద్ద నుండి అక్రమంగా ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్.పి.వై.సి.ఏ) పేరుతో వసూలు చేశారని తెలిపారు. ఇది అన్యాయంగా వసూలు చేసినట్లు స్పష్టమవుతుందున దాన్ని కూడా వినియోగదారులకు వాపసు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతేకాక ఇప్పటివరకు వసూలు చేస్తున్న 40 పైసల్ని వెంటనే ఆపేయాలని కోరారు. ఇప్పటికే వసూలు చేసిన వేల కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీల భారాన్ని మరుగుపరిచి, రూ.923 కోట్లు తగ్గింపుతోనే సరిపెట్టడం తగదని పేర్కొన్నారు. విద్యుత్ అదనపు భారాలు మోపబోమని కూటమి పార్టీలు ఎన్నికలలో హామీ ఇచ్చాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ బాదుడు ఉండదని పదే పదే ప్రకటించారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, 15 నెలల కాలంలోనే 2022-23, 23-24 సంవత్సరాలు సంబంధించి 15,485 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీల పేరుతో భారం మోపిందని విమర్శించారు.
ఇదే కాకుండా ప్రతినెల 40 పైసలు చొప్పున అదనంగా సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీకు అనుగుణంగా ఇప్పటికే వసూలు చేసిన రూ.2,758 కోట్లతో పాటు ఇప్పటికీ వసూలు చేస్తున్న రూ.15,485 కోట్ల భారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదనంగా మోపిన మొత్తం భారాలను తగ్గించి కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని, భవిష్యత్తులో ఈ సర్దుబాటు చార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం సర్దుబాటు చార్జీల భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి చేయడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
