Let's talk: editor@tmv.in
రూ.217 కోట్లు చెల్లిస్తా: సుకేశ్ చంద్రశేఖర్

రూ.217 కోట్లు చెల్లిస్తా: సుకేశ్ చంద్రశేఖర్

Pinjari Chand
28 డిసెంబర్, 2025

రూ.200 కోట్ల బెదిరింపుల(ఎక్స్ టార్షన్) కేసులో జైల్లో ఉన్న నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ కేసు పరిష్కారానికి కీలక ముందడుగు వేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన అదితి సింగ్‌కు రూ.217 కోట్ల(వడ్డీ+లీగల్ ఖర్చులు+లీగల్ నష్టం) పరిష్కార మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన శనివారం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా పటియాలా హౌస్ కోర్టులోని అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ ముందు దరఖాస్తు దాఖలు చేశారు. ఈ దరఖాస్తులో, పరిష్కారానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అది తన తప్పును అంగీకరించినట్లు కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కోర్టు 2026 జనవరి 3న విచారణ చేపట్టనుంది.

దరఖాస్తులో ప్రత్యేక సెల్ (లోధీ కాలనీ, న్యూఢిల్లీ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి, ఇరు పక్షాలు పరిష్కార మార్గాన్ని పరిశీలించేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే, ఈ పరిష్కార ప్రతిపాదన నిజాయితీతో చేసిందని నమోదు చేయడంతో పాటు, ఫిర్యాదుదారుకి నోటీసు జారీ చేయాలని కూడా సుకేశ్ కోరారు. అయితే, ఈ పరిష్కారం ఫిర్యాదుదారుడి సమ్మతికి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు.

కేసు నేపథ్యం

ఢిల్లీ పోలీసుల ప్రకారం, సుకేశ్ చంద్రశేఖర్‌పై రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లైన శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్‌ల భార్యల నుంచి సుమారు రూ.200 కోట్లను బెదిరించి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో సుకేశ్‌తో పాటు ఆయన అనుచరుడు ఏ. పౌలోస్ను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. అదనంగా ఈ కేసులో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీవోసీఏ)ను కూడా పోలీసులు ప్రయోగించారు.

పోలీసుల ఆరోపణలు

ఢిల్లీ పోలీసుల ప్రకారం, నిందితులు హవాలా మార్గాలు, షెల్ కంపెనీల నెట్‌వర్క్ వినియోగించి అక్రమంగా వచ్చిన డబ్బును దాచడం, లేయరింగ్ చేయడం, మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిష్కార దరఖాస్తుపై కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.