
రూ.19000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం ముద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన 14వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపిబి)సమావేశం భారీ పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. పర్యాటకం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధనం వంటి కీలక రంగాల్లో 14 కంపెనీల నుంచి వచ్చిన రూ.19,391 కోట్ల విలువైన ప్రతిపాదనలకు సీఎం నేతృత్వంలోని మండలి పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని సుమారు 12,000 మంది యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ పెట్టుబడుల్లో ప్రధానంగా ఇంధన రంగానికి పెద్దపీట లభించింది. నెల్లూరు జిల్లాలో రూ.6,675 కోట్లతో టాటా పవర్ సంస్థ, కడప జిల్లాలో రూ.5,571 కోట్లతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తమ ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. వీటితో పాటు వెబ్‌సోల్ రిన్యూవబుల్ సంస్థ రూ.3,538 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా ఇతర కంపెనీల ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరిచిన ఏపీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పోర్టల్‌ను సీఎం ఆవిష్కరించారు.
ఇక పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను సురక్షితమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, 15 కిలోమీటర్ల మేర క్లీన్ బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి ప్రత్యేక బ్రాండింగ్ కల్పించాలని సూచించారు. సూళ్లూరుపేట పరిసరాల్లోని చిన్న చిన్న దీవులను మాల్దీవుల తరహాలో పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆహార ప్రాసెసింగ్ రంగంలో రైతుల ఆదాయం పెంచేలా తిరుపతి ప్రాంతంలో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేయాలని, దిగ్గజ సంస్థలతో చర్చలు జరపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగంపై మాట్లాడిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి నిలబెట్టగలిగామని తెలిపిన ఆయన . విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల యూనిట్‌కు 13 పైసల వ్యయం తగ్గిందని ప్రజలపై రూ.4,500 కోట్ల ట్రూ-అప్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు రూ.3.70 కి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు, అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
