Let's talk: editor@tmv.in
రూ.18 వేల కోట్లకు ఆర్‌సీబీ విక్రయం!

రూ.18 వేల కోట్లకు ఆర్‌సీబీ విక్రయం!

Shaik Mohammad Shaffee
19 మార్చి, 2026

ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్య మార్పునకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్న 'డియాజియో' సంస్థ, తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి సారించేందుకు ఆర్‌సీబీని విక్రయించాలని 2025 నవంబర్‌లోనే నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ విక్రయ ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఆర్‌సీబీ కోసం సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18 వేల కోట్లు) భారీ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది.

బరిలో దిగ్గజ సంస్థలు

ఈ ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి సోమవారం నాటి గడువు ముగిసే సమయానికి రెండు ప్రధాన గ్రూపులు బిడ్లను దాఖలు చేశాయి. అందులో ఒకటి అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన 'ప్రేమ్‌జీ ఇన్వెస్ట్'తో కలిసిన ఈక్విటీ సంస్థ 'ఈక్యూటీ'. రెండోది మణిపాల్ గ్రూప్ అధినేత డాక్టర్ రంజన్ పాయ్ నేతృత్వంలోని బృందం. ఈ బృందంలో ప్రముఖ పెట్టుబడి సంస్థలు కేకేఆర్, టెమాసెక్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. మొదట్లో మాంచెస్టర్ యునైటెడ్ యజమానులు గ్లేజర్ కుటుంబం, అదార్ పూనావాలా వంటి ప్రముఖులు ఆసక్తి చూపినప్పటికీ, చివరి నిమిషంలో వారు వెనక్కి తగ్గారు.

బ్రాండ్ విలువలో అగ్రస్థానం

2025 ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించి ఛాంపియన్‌గా నిలవడంతో ఆర్‌సీబీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. ప్రస్తుతం 269 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఐపీఎల్‌లోనే అత్యంత విలువైన జట్టుగా ఆర్‌సీబీ రికార్డు సృష్టించింది. ఈ క్రేజ్ కారణంగానే ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు ఈ జట్టును కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన బిడ్డర్లతో చర్చలు ముగిసిన తర్వాత, బీసీసీఐ ఆమోదం పొంది, ఐపీఎల్ 2027 సీజన్ నాటికి కొత్త యాజమాన్యం చేతిలోకి జట్టు వెళ్లే అవకాశం ఉంది.

రూ.18 వేల కోట్లకు ఆర్‌సీబీ విక్రయం! - Tholi Paluku