Let's talk: editor@tmv.in
రూ.15 వేల కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ విక్రయం

రూ.15 వేల కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ విక్రయం

Shaik Mohammad Shaffee
25 మార్చి, 2026

భారత ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గ్లోబల్ బ్రాండ్ విలువ మరోసారి ప్రపంచానికి నిరూపితమైంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుల బృందం రికార్డు స్థాయిలో 1.63 బిలియన్ డాలర్లకు ((భారత కరెన్సీలో సుమారు రూ.15 వేల కోట్లు) కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు, మొత్తం క్రికెట్ ప్రపంచంలోనే ఒక జట్టుకు లభించిన అత్యధిక విలువ ఇదే కావడం విశేషం. 2021 నుంచి ఈ జట్టులో మైనారిటీ వాటాదారుగా ఉన్న అమెరికా టెక్ వ్యవస్థాపకుడు కాల్ సోమణి నేతృత్వంలోని కన్సార్టియం ఈ భారీ డీల్‌ను దక్కించుకుంది.

అమెరికా క్రీడా దిగ్గజాల చేతుల్లోకి..

ఈ కొనుగోలు బృందంలో ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార, క్రీడా దిగ్గజాలు భాగస్వాములుగా ఉన్నారు. వాల్‌మార్ట్ వారసుడు, 'డెన్వర్ బ్రోంకోస్' జట్టు యజమాని రాబ్ వాల్టన్, ఫోర్డ్ కంపెనీతో సంబంధం ఉన్న 'డెట్రాయిట్ లయన్స్' యజమానులు హాంప్ కుటుంబం ఈ కన్సార్టియంలో కీలక సభ్యులు. 'ది రైన్ గ్రూప్' సలహాదారుగా గత ఆరు నెలలుగా సాగిన సంప్రదింపులు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికన్ క్రీడా రంగంలో అపార అనుభవం ఉన్న ఈ దిగ్గజాల రాకతో రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ విలువ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరగనుంది.

బీసీసీఐ ఆమోదం తర్వాతే అధికారికం

ప్రస్తుతానికి ఒప్పందం ఖరారైనప్పటికీ, 2026 ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత బీసీసీఐ తుది ఆమోదం లభించాక ఈ విక్రయం అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ భారీ విక్రయంపై రాజస్థాన్ రాయల్స్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చిన్న జట్టుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ జట్టుగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఫ్రాంచైజీలు కూడా ఈ కొత్త బెంచ్‌మార్క్‌ను ఆసక్తిగా గమనిస్తున్నాయి. అమెరికన్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్, క్రికెట్ మేధస్సు కలయికతో ఐపీఎల్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.