
రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ
హైదరాబాద్ నగరంలో అవినీతి మరోసారి బట్టబయలైంది. నగరంలోని చెరువుల ప్రక్షాళనకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేసేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. రూ. 1.40 కోట్ల విలువైన బిల్లులను పాస్ చేసేందుకు రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పొద్దుటూరి చిన్నారెడ్డి, అతని కంప్యూటర్ ఆపరేటర్ బి. ప్రవీణ్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
నగరంలోని చెరువుల నుంచి గుర్రపు డెక్క తొలగించిన కాంట్రాక్టర్, తన పనులకు సంబంధించిన రూ. 1.40 కోట్ల బిల్లుల కోసం చిన్నారెడ్డిని ఆశ్రయించారు. అయితే, ఆ బిల్లులను ప్రాసెస్ చేయడానికి చిన్నారెడ్డి రూ. 15 లక్షలు డిమాండ్ చేయడంతో, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
పథకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా, లంచం తీసుకుంటున్న సమయంలో చిన్నారెడ్డిని పట్టుకున్నారు. అధికారుల తనిఖీల్లో లంచం డబ్బులను జాడీలలో దాచినట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం చిన్నారెడ్డిని సస్పెండ్ చేయగా, ఏసీబీ అధికారులు వారిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం చిన్నారెడ్డి, ప్రవీణ్ కుమార్ ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని పౌర పనుల్లో అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటన మరొకసారి తేటతెల్లం చేసింది.
