Let's talk: editor@tmv.in
రూ.1,000 కోట్ల సైబర్ నేరముఠా పై సీబీఐ చార్జ్‌షీట్

రూ.1,000 కోట్ల సైబర్ నేరముఠా పై సీబీఐ చార్జ్‌షీట్

Pinjari Chand
15 డిసెంబర్, 2025

దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సైబర్ మోసాలకు పాల్పడిన అంతర్జాతీయ నేర ముఠాపై సీబీఐ కీలక చర్యలు తీసుకుంది. సుమారు రూ.1,000 కోట్లకు పైగా ప్రజల నుంచి దోచుకున్న సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌కు సంబంధించి 17 మంది వ్యక్తులు, అందులో నలుగురు చైనా పౌరులు, అలాగే 58 కంపెనీలపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

111 షెల్ కంపెనీల వల

ఈ ముఠా అక్రమ నిధులను దాచేందుకు 111 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. డమ్మీ డైరెక్టర్లు, నకిలీ పత్రాలు, తప్పుడు చిరునామాలతో ఈ కంపెనీలు నమోదు చేశారు. వీటివల్ల బ్యాంక్ ఖాతాలు, పేమెంట్ గేట్వే లు తెరిచి నిధులను వివిధ దశల్లో తిప్పి మళ్లించారు. ఒక్క బ్యాంక్ ఖాతాలోనే రూ.152 కోట్లకు పైగా డబ్బు తక్కువ సమయంలో జమ అయినట్లు గుర్తించారు.

చైనా నుంచి నియంత్రణ

ఈ మోసాలకు ప్రధాన సూత్రధారులు చైనా పౌరులైన జౌ యీ, హువాన్ లియూ, వెయిజియాన్ లియూ, గువాన్హువా వాంగ్ వీరు 2020 (కోవిడ్ కాలం) నుంచి భారత్‌లోని తమ అనుచరుల ద్వారా ఈ కార్యకలాపాలు నడిపినట్లు సీబీఐ వెల్లడించింది. భారతీయ నిందితులు అమాయకుల నుంచి ఆధార్, పాన్ వంటి పత్రాలు సేకరించి షెల్ కంపెనీలు, మ్యూల్ అకౌంట్లు తెరిచారు. ఆశ్చర్యకరంగా 2025 ఆగస్టు వరకూ కొన్ని యూపీఐ ఐడీలు విదేశాల నుంచి యాక్టివ్‌గా ఉపయోగించినట్లు తేలడంతో, మోసాలపై విదేశాల నుంచే ప్రత్యక్ష నియంత్రణ ఉందని సీబీఐ నిర్ధారించింది.

ఎలా మోసాలు చేశారు?

ఈ నెట్‌వర్క్ ద్వారా నకిలీ లోన్ యాప్‌లు, తప్పుడు పెట్టుబడి పథకాలు, పొంజీ అండ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీములు, నకిలీ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, మోసపూరిత ఆన్‌లైన్ గేమింగ్ వేదికల వంటి వాటితో ప్రజలను మభ్యపెట్టారు. గూగుల్ ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్ లు, క్లౌడ్ సర్వర్లు, సిమ్ బాక్స్ టెక్నాలజీ, ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా మోసాలను అమలు చేశారు.

దేశవ్యాప్తంగా సోదాలు

I4సీ (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) సమాచారం మేరకు కేసు నమోదు చేసి, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లోని 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. డిజిటల్ పరికరాలు, బ్యాంక్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

సీబీఐ స్పష్టీకరణ

వేర్వేరు ఫిర్యాదులుగా కనిపించిన కేసులను లోతుగా పరిశీలించగా, ఒకే యాప్ నమూనా, ఒకే రకంగా డబ్బు ప్రవాహం, ఒకే డిజిటల్ ముద్రలు కనిపించడంతో ఇది ఒకే అంతర్జాతీయ కుట్ర అని తేలిందని సీబీఐ తెలిపింది.

ఈ కేసు ఎప్పుడు బయటపడిందంటే?

ఈ సైబర్ నేర ముఠా విషయం 2025 అక్టోబర్‌లో బయటకు వచ్చింది. అప్పట్లో I4సీ (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. అక్టోబర్ 2025లోనే మొదట్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. అనంతరం సాగిన లోతైన దర్యాప్తు తర్వాతే ఇప్పుడు (డిసెంబర్ 15, 2025) చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

రూ.1,000 కోట్ల సైబర్ నేరముఠా పై సీబీఐ చార్జ్‌షీట్ - Tholi Paluku