Let's talk: editor@tmv.in
రూ.1,000 ఈపీఎఫ్ పెన్షన్ ఓ ‘జోక్’: కాంగ్రెస్

రూ.1,000 ఈపీఎఫ్ పెన్షన్ ఓ ‘జోక్’: కాంగ్రెస్

Pinjari Chand
19 మార్చి, 2026

ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్‌-1995) కింద నెలకు కనీసం రూ.1,000 పెన్షన్‌పై పార్లమెంటరీ స్థాయి కమిటీ సమీక్ష సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ రాజ్యసభలో మాట్లాడుతూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో రూ.1,000 పెన్షన్ పూర్తిగా సరిపోదని, ఇది ఓ ప్రహసనంలా మారిందని వ్యాఖ్యానించారు. దాదాపు 12 ఏళ్ల మోడీ ప్రభుత్వం పాలనలో సామాజిక భద్రతా పథకాలు బలహీనపడ్డాయని ఆరోపించారు. ఇది వృద్ధులు, ఆర్థికంగా బలహీన వర్గాలపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు, అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ పరిస్థితుల్లో వేయి పెన్షన్‌తో జీవనం గడపడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంటు స్థాయి కమిటీ తన నివేదికలో ఈపీఎస్‌-1995 కింద ఇస్తున్న కనీస పెన్షన్ ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా అనర్హమని స్పష్టం చేసిందని రమేష్ తెలిపారు. జీవనోపాధికి, గౌరవప్రదమైన జీవితం కోసం తగిన స్థాయికి పెంచాలని కమిటీ సూచించిందన్నారు. లేబర్, టెక్స్‌టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై పార్లమెంటరీ స్థాయి కమిటీ 2026-27 డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై ఇచ్చిన 15వ నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. కనీస పెన్షన్‌పై అత్యవసర సమగ్ర సమీక్ష చేపట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని సిఫార్సు చేసింది.

రూ.7500 పెన్షన్ ఇవ్వాలి

పెన్షనర్లు మాత్రం నెలకు కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జంతర్ మంతర్ వద్ద ఈపీఎస్‌-95 పెన్షనర్లు మూడు రోజుల పాటు నిరసనలు కూడా నిర్వహించారు.కమిటీ పరిశీలనలో భాగంగా పెన్షనర్ల నుంచి అనేక దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రూ.1,000తో ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోవడం కష్టమని అభిప్రాయపడింది. అయితే ఈ పథకానికి కేంద్రం ఇప్పటికే ఆర్థిక మద్దతు ఇస్తోందని కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో సభ్యుల కోసం 1.16 శాతం వాటా చెల్లింపుతో పాటు కనీస పెన్షన్ అమలుకు బడ్జెట్ సాయం అందిస్తున్నట్టు పేర్కొంది. అయినప్పటికీ, ప్రస్తుత కనీస పెన్షన్ మొత్తం పెన్షనర్ల ప్రాథమిక అవసరాలకు సరిపోదని కమిటీ స్పష్టం చేసింది. అందువల్ల ఈపీఎస్‌-1995 కింద కనీస పెన్షన్‌ను తక్షణం సమీక్షించి గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని సూచించింది.