
రూ. 9,072 కోట్లతో మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో రూ. 9,072 కోట్ల వ్యయంతో మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో గోండియా–జబల్‌పూర్ సెక్షన్ డబ్లింగ్, పునరఖ్–కియూల్ సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్ల నిర్మాణం, గంహారియా–చాండిల్ సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్ల ఏర్పాటు. ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను కవర్ చేస్తాయి. దీంతో ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్ సుమారు 307 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది.
గ్రామాలకు లాభం
సుమారు 5,407 గ్రామాలు (దాదాపు 98 లక్షల జనాభా) మెరుగైన రైల్వే కనెక్టివిటీ పొందనున్నాయి. లైన్ సామర్థ్యం పెరగడంతో రద్దీ తగ్గి, సేవల విశ్వసనీయత మెరుగుపడుతుంది.
పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ
జబల్‌పూర్ కచ్నార్ శివ్ టెంపుల్, కాన్హా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ధూఅంధర్ జలపాతం, చాండిల్ డ్యామ్, దల్మా వన్యప్రాణి అభయారణ్యం వంటి ప్రాంతాలకు రైలు సౌకర్యం బలోపేతం అవుతుంది. అలాగే కోయిల, ఉక్కు, ఇనుము ఖనిజం, సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణాకు కీలక మార్గాలుగా ఇవి ఉపయోగపడతాయి. అదనంగా సంవత్సరానికి 52 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
పర్యావరణ ప్రయోజనం
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 6 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గి, 30 కోట్ల కిలోల సీఓ₂ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది దాదాపు ఒక కోటి చెట్లు నాటినంత ప్రభావం కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టులు పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు.
ముడి జూట్ మద్దతు ధర రూ. 5,925కి పెంపు
ముడి జూట్‌కు 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు క్వింటాల్‌కు రూ. 275 పెంచి రూ. 5,925గా మద్దతు ధర నిర్ణయించారు. ఈ నిర్ణయం కూడా కేబినేట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ సమావేశంలోనే తీసుకున్నారు.
రైతులకు లాభం
కొత్త ఎంఎస్పీ ద్వారా ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే రైతులకు 61.8% లాభం లభిస్తుంది. 2018-19 బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ఉత్పత్తి ఖర్చు కంటే కనీసం 1.5 రెట్లు మద్దతు ధర నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా ఈ పెంపు జరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
గతంతో పోలిస్తే
2014-15లో ఎంఎస్పీ: రూ. 2,400 / క్వింటాల్ ఉండేది, 2026-27లో ఎంఎస్పీ: రూ. 5,925 / క్వింటాల్ అయ్యింది. పెరుగుదల: రూ. 3,525 (దాదాపు 2.5 రెట్లు). జూట్ ఇండియా కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) ధర మద్దతు చర్యలను కొనసాగిస్తుంది. నష్టాలు వస్తే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. రైతుల ఆదాయ వృద్ధి, జూట్ సాగు ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
