
రూ. 900 కోట్ల రీఫండ్ కోసం కోర్టుకెక్కిన ఇండిగో
విదేశాల్లో మరమ్మతులు చేయించుకుని తిరిగి భారతదేశానికి తెచ్చిన విమాన ఇంజన్లు, విడిభాగాలపై చెల్లించిన రు. 900 కోట్లకు పైగా కస్టమ్స్ డ్యూటీని తిరిగి చెల్లించాలని కోరుతూ ఇండిగో ఎయిర్‌లైన్స్ (ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ వి. కామేశ్వరరావు, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై కస్టమ్స్ విభాగానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 8, 2026కు వాయిదా వేసింది.
ఇండిగో వాదనలు:
డబుల్ ట్యాక్స్:
విదేశాల్లో మరమ్మతులు చేయించుకున్న భాగాలపై కస్టమ్స్ డ్యూటీ విధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఒకే లావాదేవీపై రెండుసార్లు పన్ను వేయడమేనని ఇండిగో పేర్కొంది.
GST చెల్లింపు:
మరమ్మతులను 'సర్వీస్'గా పరిగణించి ఇప్పటికే రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన జీఎస్టి చెల్లించామని, మళ్ళీ కస్టమ్స్ డ్యూటీ వసూలు చేయడం సరికాదని కంపెనీ వాదించింది.
ముందస్తు తీర్పులు:
గతంలో కస్టమ్స్ ట్రిబ్యునల్ ఇటువంటి రీ-ఇంపోర్ట్‌లపై కస్టమ్స్ డ్యూటీ విధించకూడదని తీర్పు ఇచ్చిందని కంపెనీ గుర్తు చేసింది. సుమారు 4,000 బిల్లులపై 'నిరసన' వ్యక్తం చేస్తూనే ఈ పన్ను చెల్లించామని తెలిపింది.
కస్టమ్స్ శాఖ వాదన:
ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కాబట్టి ఈ పిటిషన్ అపరిపక్వమైనదని కస్టమ్స్ తరపు న్యాయవాది వాదించారు. అయితే, సుప్రీంకోర్టు దీనిపై ఎటువంటి స్టే ఇవ్వలేదని ఆయన అంగీకరించారు.
