
రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యం దారిమళ్లింపు: 19 రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
పేదలకు చెందాల్సిన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పడుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలను వెలికితీసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మెరుపు దాడులు నిర్వహించాయి. 9 జిల్లాల్లోని 19 రైస్ మిల్లుల్లో జరిపిన ఈ తనిఖీల్లో సుమారు రూ. 60 కోట్ల విలువైన ధాన్యం దారిమళ్లినట్లు అధికారులు గుర్తించారు.
ఈ తనిఖీల్లో 1.90 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యంతో పాటు 1.72 లక్షల బస్తాలు దారి మళ్లినట్లు లేదా లెక్కల్లో లేనట్లు తేలింది. మొత్తం 19 మిల్లుల్లో 14 రైస్ మిల్లులు తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డాయని అధికారులు నిర్ధారించారు. ఇవి సెంట్రల్ మిల్లింగ్ రైస్ పాడిని అక్రమంగా మళ్లించినట్టు ఆధారాలు లభించాయి.
జిల్లాల వారీగా పెద్ద మొత్తంలో మళ్లింపులు బయటపడ్డాయి.
• కామారెడ్డి & నిజామాబాద్ జిల్లాల్లో రూ.19.73 కోట్లు,
• సూర్యాపేట జిల్లాలో రూ.19.32 కోట్లు,
• నారాయణపేట జిల్లాలో రూ.15.91 కోట్లు,
• పెద్దపల్లి జిల్లాలో రూ.11.38 కోట్లు,
• మహబూబాబాద్ జిల్లాలో రూ.4.86 కోట్ల విలువైన ధాన్యం మళ్లింపులు జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ వ్యవహారంలో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, సంబంధిత రైస్ మిల్లుల లైసెన్సులు రద్దు చేయాలని అధికారికంగా రిక్విజిషన్లు పంపించారు. అంతేకాదు, కొన్ని మిల్లుల్లో ఈ అక్రమాలు ఒక సీజన్‌కే పరిమితం కాకుండా అనేక సీజన్లుగా కొనసాగుతున్నట్టు విజిలెన్స్ బృందాలు గుర్తించాయి.పేదల నోటి కాడి కూడును అమ్ముకుంటున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు హెచ్చరించారు.
