Let's talk: editor@tmv.in
రూ. 4,000 కోట్లతో గువహటి విమానాశ్రయ కొత్త టెర్మినల్:రేపటి నుండే ప్రయాణికులకు అనుమతి

రూ. 4,000 కోట్లతో గువహటి విమానాశ్రయ కొత్త టెర్మినల్:రేపటి నుండే ప్రయాణికులకు అనుమతి

Dantu Vijaya Lakshmi Prasanna
21 ఫిబ్రవరి, 2026

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఫిబ్రవరి 20న ఒక ప్రకటన చేస్తూ, గౌహతి లోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనం ఈ నెల 22 నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దాదాపు రూ. 4,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక టెర్మినల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది డిసెంబర్ 20న అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం కొద్ది ఏళ్లలోనే ఈ విమానాశ్రయం అద్భుతమైన మార్పుకు గురైందని, ఇది అస్సాం కనెక్టివిటీకి ఒక నిదర్శనమని సీఎం శర్మ '' ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్-2 భవనం సుమారు 1,40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఏడాదికి సుమారు 1.31 కోట్ల మంది (13.1 మిలియన్లు) ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ భవనాన్ని రూపొందించారు. కేవలం కొన్ని ఏళ్లలోనే ఈ ప్రాంతం అద్భుతమైన మార్పుకు లోనైందని సీఎం కొనియాడారు. పాత భవనాన్ని కార్గో హబ్‌గా మార్చనున్నారు.

విమానాల కార్యకలాపాలు

ఫిబ్రవరి 22 నుండి కార్యకలాపాలు మొదలైనప్పటికీ, మార్చి నాటికి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ పూర్తిస్థాయిలో ఈ కొత్త టెర్మినల్ నుండే నడిచే అవకాశం ఉంది. పాత టెర్మినల్ భవనాన్ని ఇకపై ప్రయాణికుల కోసం కాకుండా, సరుకు రవాణా (కార్గో హబ్) కేంద్రంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల వాణిజ్య రంగానికి, ఎగుమతులకు భారీ ఊతం లభించనుంది.

ఈ కొత్త టెర్మినల్ భవనం అస్సాం రాష్ట్ర జీవవైవిధ్యం, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్మించబడింది. విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులకు అస్సాం సంస్కృతి ఉట్టిపడేలా లోపలి అలంకరణలు, వాస్తుశిల్పం ఉన్నాయి. అంతేకాకుండా, విమానాశ్రయం బయట అస్సాం తొలి ముఖ్యమంత్రి లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ 80 అడుగుల భారీ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

"ఒక సాధారణ స్థలం నుండి ప్రపంచ స్థాయి ముఖద్వారం వరకు జరిగిన ఈ మార్పు, మరింత అనుసంధానిత, ఆత్మవిశ్వాసం కలిగిన అస్సాం కోసం ప్రభుత్వం కలిగి ఉన్న స్పష్టమైన విజన్‌ను ప్రతిబింబిస్తుంది" అని సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందడం వల్ల పర్యాటక రంగం మెరుగుపడటమే కాకుండా, ఆగ్నేయ ఆసియా దేశాలకు అస్సాం ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.