Let's talk: editor@tmv.in
రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్వో

రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్వో

Panthagani Anusha
25 జనవరి, 2026

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో శనివారం కలకలం రేగింది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) యేకా మురళి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కుకున్నారు. కేటరింగ్ బిల్లులను మంజూరు చేసేందుకు బాధితుడి నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయం పనివేళల్లోనే ఈ మెరుపు దాడి జరగడం జిల్లా అధికారుల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేసు వివరాల్లోకి వెళ్తే.. 2023లో అప్పటి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ‘సగర్‌మాతా కేటరింగ్ సర్వీసెస్’ సంస్థ సుమారు 41 వేల భోజన ప్యాకెట్లను సరఫరా చేసింది. దీనికి సంబంధించి మొత్తం రూ. 37 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో గతంలో రూ. 10 లక్షలు చెల్లించగా మిగిలిన రూ. 26 లక్షల చెక్కును విడుదల చేయాల్సిందిగా బాధితుడు డీఆర్వోను కోరారు. అయితే ఆ బిల్లును ఆమోదించడానికి ప్రతిఫలంగా డీఆర్వో మురళి రూ. 3 లక్షల లంచం డిమాండ్ చేశారు.

తమ కష్టార్జితం కోసం లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. శనివారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధితుడి నుంచి డీఆర్వో నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అదనపు ఎస్పీ మహింద్ర మత్తే ఆధ్వర్యంలోని బృందం ఆయన్ను పట్టుకుంది. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయన చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లుగా నిర్ధారించుకున్నారు.

ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని అదనపు ఎస్పీ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అన్ని ఆధారాలను సేకరించామని డీఆర్వోపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పనుల కోసం లంచం ఆశించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్వో - Tholi Paluku