
రూ. 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణం
దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యాసానికి అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం, నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రూపం సంతరించుకోనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ ప్రాంగణాన్ని ఇప్పుడున్న దానికంటే మూడు రెట్లు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం రూ. 225 కోట్లతో సమగ్ర పునరుద్ధరణ పనులను చేపట్టింది.
ఆలయ సంప్రదాయం, ఆగమ శాస్త్రాలకు భంగం కలగకుండా, ఈ మాస్టర్ ప్లాన్‌ను శృంగేరి శారదా పీఠం అనుమతితో రూపొందించారు. గర్భాలయం, మంటపాలు, గోపురాలు, కోనేరు నిర్మాణంలో పీఠం సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సుమారు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణం 62,000 చదరపు అడుగులకు విస్తరించనుంది. గర్భగుడి, అర్ధ మండపం కూడా 2,000 చదరపు అడుగుల నుంచి 5,000 చదరపు అడుగులకు పెంచడం ద్వారా భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించనున్నారు.
ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉత్తర దిశలో 9 అంతస్తుల రాజగోపురం నిర్మించనున్నారు. ఇతర దిశల్లో 7 అంతస్తుల గోపురాలు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు వైపులా 33 అడుగుల వెడల్పుతో మాడ వీధులను అభివృద్ధి చేయడం ద్వారా ఆలయ పరిసరాలు సంప్రదాయ శైలిలో రూపుదిద్దుకోనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఒకేసారి సుమారు 6,000 మంది కోసం క్యూ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నారు. అలాగే 200 మంది కూర్చునే సామర్థ్యంతో ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ఈశాన్య దిశలో కోనేరు నిర్మించనున్నారు.
తూర్పు దిశలో అలంకారిక ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారాలు, సమాచార కేంద్రం, మెరుగైన రహదారులు, అండర్‌పాస్ కనెక్టివిటీ, సౌరశక్తితో కూడిన రూఫ్‌టాప్ పార్కింగ్, ఉద్యానవనాలు ఆరోగ్య కేంద్రం వంటి సదుపాయాలు కూడా అభివృద్ధి చేయనున్నారు. భక్తులకు సమగ్ర అనుభవం కల్పించేందుకు అన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
పుష్కరాల సన్నాహాలు
వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు గోదావరి నది తీరాన ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్షరాభ్యాసానికి వచ్చే చిన్నారులకు, వారి కుటుంబాలకు ఈ పునర్నిర్మాణం ఒక గొప్ప కానుకగా నిలవనుంది.
