
రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. గురువారం ఖానామెట్ ప్రాంతంలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో సుమారు రూ. 2,200 కోట్ల విలువైన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తం చేసింది.
ఖానామెట్ పరిసరాల్లోని ప్రభుత్వ భూములను, చెరువు పోరంబోకు స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారని స్థానికులు హైడ్రా హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు, జనవరి 31న రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఆక్రమణదారులు కూడా హాజరయ్యారు. రెవెన్యూ అధికారులు సాటిలైట్ మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, సదరు 11 ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని, అది ఆక్రమణకు గురైందని నిర్ధారించారు. దీంతో ఆక్రమణదారులకు తగిన సమయం ఇచ్చిన తర్వాత, హైడ్రా బృందం అక్కడ ఉన్న తాత్కాలిక షెడ్లు, షాపులను తొలగించింది.
ఒక చెరువు పక్కనే ఉన్న ఈ ఖరీదైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం భారీ ఆస్తిని కాపాడినట్లయింది. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ ఆపరేషన్ ద్వారా హైడ్రా మరోసారి హెచ్చరించింది.
