
రూ. 1.9 లక్షల లంచం తీసుకుంటూ ఇంజనీర్ పట్టుబాటు
తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం యాదగిరిగుట్టలో అవినీతి బాగోతం బయటపడింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన ఈ దేవస్థానంలో కార్యనిర్వాహక ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు బుధవారం చిక్కారు. ఈ అధికారి ఏకంగా రూ. 1.9 లక్షలు లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా మల్కాజిగిరిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఏసీబీ గురువారం అధికారికంగా వెల్లడించింది.
పట్టుబడిన ఈ అధికారి దేవదాయ శాఖలో ఇంఛార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఆలయంలో ఫుడ్ మెషిన్ల ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన ఒక బిల్లును ప్రాసెస్ చేసినందుకుగాను సదరు అధికారి ఈ లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్టు బిల్లు మొత్తం (జీఎస్టీ మినహా) రూ. 11.5 లక్షలు ఉండగా దానిని క్లియర్ చేసినందుకు రివార్డు పేరుతో అధికారి ఫిర్యాదుదారుడి నుంచి లంచం అడిగారు.
ఈ విషయమై ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు మెదక్ మల్కాజిగిరి జిల్లాలో పక్క ప్రణాళికతో ఫిర్యాదుదారుడి నుంచి రూ. 1.9 లక్షల లంచం డబ్బు తీసుకుంటున్న సమయంలోనే అధికారులు నిందితుడిని పట్టుకున్నారు.అనంతరం మొత్తం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అధికారి తమ విధులను అక్రమంగా నిర్వర్తించినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
