
రూ. 175 కోట్ల రహదారికి శంకుస్థాపన
వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు, మెట్రోపాలిటన్ కమిషనర్ కే.ఎస్. విశ్వనాథన్ కలిసి సంయుక్తంగా వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు 175 కోట్ల రూపాయల ఖర్చుతో 26.72 కి.మీ. పొడవున 7 ప్రధాన బృహత్తర ప్రణాళిక రహదారులను నిర్మించేందుకు సంబంధించి అడవివరం జంక్షన్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో వీఎంఆర్డీఏ ప్రధాన భూమిక పోషిస్తోందని, దానిలో భాగంగానే బృహత్తర ప్రణాళిక రహదారులను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని, ఈ రహదారులన్ని అతి త్వరలోనే ప్రారంభించబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించే ముఖ్యమైన రహదారులని, జాతీయ రహదారిపై ప్రయాణ ఒత్తిడి తగ్గించి త్వరగా విమానాశ్రయానికి చేరుకోవడంలో ఈ రహదారులన్నీ దోహదపడతాయన్నారు.
చిప్పాడ-పోలిపల్లి రహదారి 6.32 కి.మీ పొడవున, నేరేళ్ల వలస- తాళ్ళవలస రహదారి 4.00 కి.మీ పొడవున, బోయపాలెం - కాపులుప్పాడ రహదారిని 3.10 కి. మీ. పొడవున, గంభీరం రహదారిని 2.20 కి.మీ పొడవున, గంభీరం - పరదేశిపాలెం రహదారి 1.40 కి.మీ పొడవున అడివివరం - గండిగుండం రహదారి 8.00 కి.మీ పొడవున, శివశక్తి నగర్ రహదారి 1.70 కి.మీ పొడవున అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో 98వ వార్డ్ కార్పొరేటర్ పీవీ నరసింహం, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్ పర్యవేక్షక ఇంజనీర్ మధుసూదన రావు, ఉప కార్యనిర్వహక ఇంజినీర్లు విశ్వనాథ్, రవిశంకర్, సహాయక ఇంజనీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
