
రూ. 1,734 కోట్లతో మహబూబ్‌నగర్ - గుడేబెల్లూర్ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మరో కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-167లో భాగంగా మహబూబ్‌నగర్ నుంచి గుడేబెల్లూర్ వరకు గల విభాగాన్ని నాలుగు లేన్ల రహదారిగా మార్చేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేసింది.
సుమారు 80 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి పనులను రూ. 1,734 కోట్ల అంచనా వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ కాంట్రాక్టును మెస్సర్స్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 2026లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది మొత్తం 80 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే ప్రాజెక్ట్ హైదరాబాదు–పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉంది.
ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు ప్రధాన వంతెనలు, 36 చిన్న వంతెనలు, 260 కల్వర్టులు, 11 వెహిక్యులర్ అండర్‌పాసులు, 22 లైట్ వెహికల్ అండర్‌పాసులు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్, 48 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు, అలాగే 56 కిలోమీటర్ల స్లిప్ రోడ్లు నిర్మించనున్నారు.
ప్రస్తుతం ఈ మార్గంలోని గుడేబెల్లూరు–మహబూబ్‌నగర్ సెక్షన్‌లో గుడేబెల్లూరు, మాగ్నూర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లైర్, యెలిగండ్ల, బండర్‌పల్లి వంటి పట్టణాలు, గ్రామాల వద్ద భారీ ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ ఆలస్యాలు కనిపిస్తున్నాయి. నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ అడ్డంకులు మెరుగుపడడంతో పాటు రోడ్డు భద్రత కూడా పెరుగుతుంది.
ఈ రహదారి పీఎం గతి శక్తి కింద 3 ఆర్థిక నోడ్‌లు, 9 సామాజిక నోడ్‌లు, 7 లాజిస్టిక్ నోడ్‌లను అనుసంధానిస్తుంది.ఇది హైదరాబాద్‌లోని పారిశ్రామిక కేంద్రాలు, హైదరాబాద్-బెంగళూరు ఎన్ఐసీడీసీ కారిడార్, ఫార్మా క్లస్టర్లు, సెజ్ లకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. మహబూబ్‌నగర్, నారాయణపేట, రాయచూర్ వంటి ప్రధాన పట్టణాల మధ్య రవాణా సులభతరం కావడమే కాకుండా, ఈ ప్రాంతంలోని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.
