Let's talk: editor@tmv.in
రూ. 1003 కోట్ల విలువైన‌ ప్ర‌భుత్వ భూమ‌ని కాపాడిన హైడ్రా

రూ. 1003 కోట్ల విలువైన‌ ప్ర‌భుత్వ భూమ‌ని కాపాడిన హైడ్రా

Gaddamidi Naveen
12 ఫిబ్రవరి, 2026

భాగ్యనగరంలో కబ్జారాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా మరోసారి తన ప్రతాపం చూపింది. జూబ్లీహిల్స్, ఖానామెట్ ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో దాదాపు రూ. 1,003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా కోరల నుంచి రక్షించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి ఆక్రమణలను తొలగించి సంబంధిత భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్‌లో అపోలో ఆసుపత్రి ఔట్‌గేట్‌కు ఎదురుగా ఉన్న సుమారు 2 ఎకరాల పార్కు భూమిలో ఒక వ్యక్తి ఆక్రమణకు పాల్పడ్డాడు. లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్న కిరాయిదారు పార్కులోకి సుమారు 150 గజాల మేర చొరబడి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఏకంగా రూ. 3 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకోవాల‌నుకున్నాడు. పాత భవనానికి ఆనుకుని మరో నిర్మాణం చేసి, ఒక్కో అంతస్తులో నాలుగు పడకల గదులను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా పార్కు వైపు గేటు ఏర్పాటు చేసి సుమారు 100 గజాల మేర ప్రైవేట్ స్థలంలా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక నివాసితుల ఫిర్యాదులపై హైడ్రా అధికారులు జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి పరిశీలన చేపట్టి ఆక్రమణను నిర్ధారించారు. అనంతరం మూడు అంతస్తుల నిర్మాణాన్ని కూల్చివేసి పార్కు భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆక్రమణకు పాల్పడిన వారిపై పోలీసు కేసు నమోదు చేశారు.

ఇక హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని ఖానామెట్ ప్రాంతంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. ఇక్కడ ఎకరం విలువ రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమిని గతంలో ఆల్ ఇండియా వెలమ సంఘానికి ప్రభుత్వం కేటాయించగా, కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో హైకోర్టు స్టే విధించింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొందరు స్థానికులు వెనుక వైపు నుంచి మట్టి పోస్తూ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాచ్‌మ్యాన్‌పై దాడి చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలకు అవకాశం లేకుండా మొత్తం ఐదు ఎకరాల పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు వెలువడే వరకు భూమి రక్షణలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో కలిపి మొత్తం రూ.1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా సంరక్షించింది.