Let's talk: editor@tmv.in
రూపాయి రోలర్ - కోస్టర్ ప్రయాణం… ఆరు నెలలుగా పడిపోతున్న భారత కరెన్సీ

రూపాయి రోలర్ - కోస్టర్ ప్రయాణం… ఆరు నెలలుగా పడిపోతున్న భారత కరెన్సీ

Dantu Vijaya Lakshmi Prasanna
4 డిసెంబర్, 2025

‘‘ఒక దేశ ఆర్థిక గమనాన్ని తెలుపేది దాని కరెన్సీ విలువ’’ అని ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పే మాట. ఇది గత ఆరు నెలలుగా భారత రూపాయి ప్రవర్తనను చూస్తే మరింత స్పష్టమవుతోంది. ఒకప్పుడు డాలర్‌తో పోలిస్తే స్థిరంగా ఉండే రూపాయి, ఇప్పుడేమో ప్రతి రోజు కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తూ సాధారణ ప్రజల నుంచి పెద్ద కంపెనీల వరకు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇది కేవలం సంఖ్యల ఆట కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న లోతైన ఒత్తిడుల ప్రతిబింబం. మార్కెట్ నిపుణులు కూడా ‘‘ఇది ఒక హెచ్చరిక గడియారం’’ అని చెబుతున్న తరుణంలో, రూపాయి ఎందుకు కూలిపోతోంది, దాని ప్రభావం ఏమిటి, ముందున్న దారి ఏంటి అన్న విషయాలను విశ్లేషించడం ఎంతో అవసరం.

గత ఆరు నెలల రూపాయి పతనం

గడిచిన ఆరు నెలల్లో రూపాయి విలువ పడిపోవడం ఆందోళన కలిగించేలా ఉంది. ఆగస్టు వరకు రూ.84, 85 మధ్యన నిలిచిన రూపాయి, సెప్టెంబర్ చివరి నుండి మళ్లీ క్షీణించడం ప్రారంభించింది. అక్టోబర్ నాటికి డాలర్ డిమాండ్ పెరగడంతో రూ..87 దాటింది. నవంబరు వచ్చేసరికి రూ.88 కూడా దాటేసింది. డిసెంబరు కాలానికి చేరేసరికి రూపాయి చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.90 మార్క్‌ను కూడా దాటి వార్తల్లో నిలిచింది. ఈ పతనం ఒక్కరోజులో కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితులు, మారుతున్న వడ్డీరేట్లు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న దిగుమతి వ్యయం వంటి అంశాలన్నీ కలిసొచ్చి రూపాయిని ఒత్తిడికి గురి చేశాయి.

శక్తివంతమైన డాలర్ రూపాయి మీద మొదటి దెబ్బ

అమెరికా ఫెడరల్ రిజర్వ్ గత ఏడాది నుంచి వడ్డీరేట్లను వరుసగా పెంచుతూ రావడం ప్రపంచ మార్కెట్లో డాలర్‌ను బలపరిచింది. డాలర్ బలపడితే సాధారణంగా రెండు పరిణామాలు జరుగుతాయి. పెట్టుబడిదారులు డాలర్ ఆధారిత ఆస్తుల్లో పెట్టుబడులు పెంచుతారు. అలాగే ఎమర్జింగ్ మార్కెట్లు అని పిలిచే భారతదేశం వంటి దేశాల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది. భారత మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు అమెరికాకు వెళ్లడంతో డాలర్ డిమాండ్ పెరిగి, రూపాయి విలువ సహజంగానే తగ్గింది. ఇదే రూపాయి పడిపోవడానికి ప్రారంభ దెబ్బ.

దిగుమతులపై భారీగా ఆధారపడటం

భారత్‌ నూనె, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెషినరీ వంటి కీలక రంగాల్లో దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశం. డాలర్ బలపడినప్పుడు దిగుమతులు ఖరీదవుతాయి. ఇదే గత ఆరు నెలలుగా భారత్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. డాలర్ రేటు పెరిగిన ప్రతిసారి దిగుమతి బిల్లులు పెరుగుతాయి, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద పడుతుంది. ఉదాహరణకు, 85 రూపాయిల వద్ద దిగుమతి చేసుకునే సరుకులు, 90 రూపాయిల వద్ద దిగుమతి చేస్తే 5, 6 శాతం అదనంగా ఖర్చవుతుంది. ఈ పెరుగుదల ముందు నూనె ధరల రూపంలో, తరువాత పాలు, కూరగాయలు, రవాణా, విద్యుత్ ఛార్జీలు వంటి అనేక రంగాల్లో ధరల పెరుగుదల రూపంలో ప్రజల జీవితాల్లో ప్రత్యక్షమవుతుంది.

ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐల ఉపసంహరణ

2025 సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారుల ప్రవర్తనలో గణనీయ మార్పు కనిపించింది. గ్లోబల్ రిసెషన్ భయాలు, వడ్డీరేట్లు పెరగడం, యుద్ధ పరిస్థితులు, భారత మార్కెట్ తగ్గడం వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో నిధులను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్తే మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరుగుతుంది, ఇది సహజంగానే రూపాయి బలహీన పడటానికి దారితీస్తుంది. గత ఆరు నెలల్లో ఇదే జరిగింది.

ద్రవ్యోల్బణం పెరగడం

రూపాయి బలహీనపడటం అనేది ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రధాన కారకం. దిగుమతి ధరలు పెరగడం వల్ల తయారీ రంగం వ్యయం పెరిగి, అది వస్తువుల ధరల్లో ప్రతిబింబిస్తుంది. ఈ పరిస్థితిని అదుపులో పెట్టేందుకు ఆర్బీఐ సాధారణంగా వడ్డీ రేట్లు పెంచుతుంది. కానీ వడ్డీరేట్లు పెరగడం కూడా పెట్టుబడుల ప్రవర్తనను ప్రభావితం చేసి, ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తుంది. ఇలా రూపాయి పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీరేట్లు పెరగడం అన్నీ ఒక దుష్ప్రభావ చక్రంలా మారిపోయాయి.

వాణిజ్య లోటు పెరగడం

గత నెలల్లో భారత్‌ ఎగుమతి రంగంలో పెద్దగా వృద్ధి కనిపించలేదు. అయితే దిగుమతుల డిమాండ్ మాత్రం పెద్దగా తగ్గలేదు. దీనివల్ల వాణిజ్య లోటు పెరిగి, ఇంకా ఎక్కువ డాలర్ల అవసరం ఏర్పడింది. వాణిజ్య లోటు పెరిగే కొద్దీ రూపాయి మీద ఒత్తిడి కూడా పెరిగింది. ఇది కూడా రూపాయి విలువ తగ్గడానికి ప్రధాన కారణమే.

ఆర్థిక వ్యవస్థపై రూపాయి పతనం ప్రభావం

రూపాయి పడిపోవడం ప్రజల జీవితాల్లో మొదట కనిపించే ప్రభావం పెరిగిన నూనె ధరలు, రోజువారీ వస్తువుల ధరకల్లో పెరుగుదల. దిగుమతి చేసే మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు మరింత ఖరీదవుతాయి. పిల్లలను విదేశీ చదువుకు పంపాలనుకునే కుటుంబాలకు ఖర్చు దాదాపు రెట్టింపు అవుతుంది.

మార్కెట్‌పై కూడా దీనికి ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. ఎగుమతులపై ఆధారపడే ఐటి, ఫార్మా రంగాలకు రూపాయి పతనం లాభదాయకం. కానీ దిగుమతులపై ఆధారపడే ఎఫ్ఎమ్ సిజి , ఆటో, బ్యాంకింగ్ రంగాలకు దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వ ఖర్చు కూడా పెరుగుతుంది, సబ్సిడీల భారం పెరుగుతుంది, బడ్జెట్ సమతుల్యత దెబ్బతింటుంది.

పతనంలో ఉన్న అవకాశాలు

రూపాయి పడిపోవడం మొత్తం నష్టమే కాదు. డాలర్‌లో ఆదాయం పొందే ఐటి కంపెనీలు, రిమిటెన్స్‌లు పంపించే ఎన్ఆర్ఐలు అందరూ లాభపడతారు. రూపాయి బలహీన పడినప్పుడు భారత ఉత్పత్తులు విదేశీ మార్కెట్లో కొంచెం చవకగా కనిపిస్తాయి, ఇది ఎగుమతులను ప్రోత్సహిస్తుంది.

ముందున్న దారి ఏమిటి?

నిపుణుల అంచనాల ప్రకారం రూపాయి రూ.90 వద్ద కొంతకాలం స్థిరపడే అవకాశం ఉంది. కానీ గ్లోబల్ పరిస్థితులు మరింత కఠినతరం అయితే రూ.92 నుండి రూ.95 వరకూ పడిపోవచ్చు. ఆర్బీఐ నుంచి కఠినమైన జోక్యం వస్తే కొంత పునరుద్ధరణ వచ్చే అవకాశముంది. ప్రపంచ వడ్డీరేట్ల మార్పులు, చమురు ధరలు, యుద్ధాలు, దేశీయ రాజకీయాలు ఇవన్నీ రూపాయి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

రూపాయి పడిపోవడం అనేది మనలో చాలామందికి కేవలం వార్తలా అనిపిస్తుందేమో. కానీ దాని ప్రభావం ప్రతి ఇంటి బడ్జెట్‌లో, ప్రతి వ్యక్తి దైనందిన ఖర్చుల్లో దర్శనమిస్తుంది. విదేశీ చదువు కోసం కలలు కన్న విద్యార్థుల కలలు భారంగా మారుతాయి. పెరుగుతున్న ధరలతో గడవని బడ్జెట్‌ను చూసి గృహిణులు నిశ్శబ్దంగా ఆందోళన చెందుతారు. ఉద్యోగులు ఒక్క రూపాయి విలువ తగ్గితే తమ జీతం విలువ కొంచెం తగ్గిందనే భావనతో మౌనంగా నడిచిపోతారు.

అయినా ఈ దేశం ఎన్నో సంక్షోభాలను చూసింది, ప్రతిసారి మరింత బలంగా బయటపడింది. రూపాయి పతనం కూడా ఒక పరీక్ష మాత్రమే. దీన్ని అధిగమించే శక్తి భారత ఆర్థిక వ్యవస్థకు, ఇంకా భారత ప్రజలకు ఉంది. ప్రతి పతనం తర్వాత ఉన్నదల్లా నిలబడటమే, అదే భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో చూపబోయే దిశ.