
రుణభారం తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్థిక సమస్యలు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. కుటుంబానికి ఆధారం అయిన ఆటో డ్రైవర్ సయ్యద్ అరిఫ్ (48), పెరిగిపోయిన రుణభారం, ఆర్థిక ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలి రోడ్డు ప్రమాదంలో అరిఫ్ కాలుకు తీవ్ర గాయం అయింది. దీని కారణంగా ఆయన పని చేయలేక, ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కాగా అరిఫ్ కుటుంబానికి ఏకైక జీవనాధారం కావడంతో ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో గతంలో తీసుకున్న రుణాలు చెల్లించలేక కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేమనే ఆందోళనతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ ఒత్తిడిలోనే సయ్యద్ అరిఫ్ పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తండ్రి పురుగుమందు తాగిన సంఘటనను చూసిన ఆయన చిన్న కుమారుడు సోయియన్. "నాన్న లేని జీవితం వద్ద" అంటూ తండ్రి చేతిలో ఉన్న మందును తీసుకుని తాను కూడా తాగేశాడు. వెంటనే అరిఫ్‌ను, సోయియన్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరిఫ్ మరణించారు. ప్రస్తుతం కుమారుడు సోయియన్ చికిత్స పొందుతున్నాడు.
ఈ హృదయ విదారక ఘటన నర్సాపూర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దీంతో పరిశ్రమలోని తోటి ఆటో డ్రైవర్లు స్థానికులు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి మద్దతుగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఘటన రోడ్డు ప్రమాద బాధితులకు, దినసరి కూలీల కుటుంబాలకు సరైన సామాజిక భద్రత, ఆర్థిక మద్దతు వ్యవస్థలు ఎంత అవసరమో తెలియజేస్తోంది.
