Let's talk: editor@tmv.in
రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్ సాధారణ పౌరులనూ చేరింది: ప్రధాని మోడీ

రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్ సాధారణ పౌరులనూ చేరింది: ప్రధాని మోడీ

Pinjari Chand
16 ఫిబ్రవరి, 2026

తన ప్రభుత్వ ‘రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ సాధారణ పౌరులకు విశేషంగా లాభం చేకూర్చుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పేర్కొన్నారు. వచ్చే దశాబ్దానికి మూడు ప్రధాన ప్రాధాన్యాలు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అందులో కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, సాంకేతికత–తయారీ–సేవారంగాల్లో ఆవిష్కరణను మరింత లోతుగా తీసుకెళ్లడం, పాలనను ఇంకా సరళీకరించడం అని తెలిపారు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్కరణల పురోగతిపై సంతృప్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు మోడీ స్పందిస్తూ, తాను మామూలుగానే పూర్తిగా సంతృప్తి చెందనని, ప్రజా జీవితానికి నిర్మాణాత్మక ఆత్రుత అవసరమని అన్నారు. మరింత చేయాలి, వేగంగా మెరుగుపరచాలి, మెరుగ్గా సేవలందించాలి అనే తపన ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. వచ్చే దశాబ్దానికి మూడు ఆర్థిక సంస్కరణలను ప్రాధాన్య క్రమంలో చెప్పాలంటే? అన్న ప్రశ్నకు మోడీ ఇలా సమాధానమిచ్చారు. మా దిశ స్పష్టంగా ఉంది. ఒక నిర్దిష్ట సంఖ్యకు పరిమితం చేయడం కంటే, మొదటగా పోటీతత్వం, ఉత్పాదకత పెంచే నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తాం. రెండవది, సాంకేతికత, తయారీ, సేవారంగాల్లో ఆవిష్కరణను మరింత లోతుగా తీసుకెళ్తాం. మూడవది, పౌరులు, వ్యాపారాలు మరింత సౌలభ్యం, విశ్వాసంతో పని చేయగలిగేలా పాలనను ఇంకా సరళీకరిస్తామన్నారు.

సంస్కరణల ఫలితంగా మధ్యవర్తుల సమస్య తగ్గిందని, మౌలిక వసతుల విస్తరణతో కనెక్టివిటీ మెరుగై, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలు అంటే కేవలం ఆర్థిక, పరిశ్రమ రంగాలకే పరిమితం కాదు. సామాజిక రంగ సంస్కరణలు కూడా అంతే ముఖ్యమైనవని అన్నారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ వంటి కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాల్లో మార్పు తీసుకువచ్చాయని చెప్పారు. అలాగే ప్రత్యేకంగా వెనుకబడిన ఆదివాసీ సమాజాల సంక్షేమం కోసం పీఎం-జన్మాన్ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. ఇన్‌క్రిమెంటల్ అడ్జస్ట్మెంట్స్ నుంచి సిస్టమిక్ ట్రాన్స్‌ఫార్మేషన్ దిశగా మేము ముందుకు కదిలామని మోడీ పేర్కొన్నారు. ఉదాహరణగా, జీఎస్టీ రెండు స్లాబ్ నిర్మాణంతో గృహాలు, సూక్ష్మ–చిన్న–మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు), కార్మిక ఆధారిత రంగాలపై భారం తగ్గిందని చెప్పారు. చిన్న కంపెనీల నిర్వచనాన్ని మార్చి అనుగుణత వ్యయాలను తగ్గించామని అన్నారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఇవ్వడం ద్వారా ముఖ్యంగా మధ్యతరగతికి మెరుగైన ఎంపికలు లభించాయని తెలిపారు. పలు పాత చట్టాలు చరిత్రపుటల్లోకి వెళ్లాయని, నైపుణ్యాభివృద్ధి, మత్స్యశాఖ, సహకార రంగం, ఆయుష్ వంటి కీలక రంగాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

దశాబ్దాలుగా ఎదురుచూసిన కార్మిక సంస్కరణలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని, కార్మికుల ప్రయోజనాలు కాపాడుతూ, వ్యాపారాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచ నాయకత్వం వహిస్తున్నదని, ఇది యూపీఐ వేదిక ద్వారా లావాదేవీల విధానంలో జరిగిన మౌలిక సంస్కరణ ఫలితమని చెప్పారు. యువత కోసం సంస్కరణలు అవకాశాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాయని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగిందని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు రుణ సౌకర్యాలు మెరుగుపడి, పన్ను విధానాలు సరళమై, గ్లోబల్ విలువ వ్యవస్థలో అనుసంధానం బలమైందని చెప్పారు. అలాగే ఎంఎస్ఎంఈల పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను పెంచి, అభివృద్ధి చెందుతూ కూడా ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.