
రిషభ్ పంత్ పునరాగమనం!
భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత పంత్ దేశవాళీ క్రికెట్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2025-26 రెండో రౌండ్‌లో ఢిల్లీ జట్టు తరఫున పంత్ ఆడే అవకాశం ఉంది.
ఫిట్‌నెస్ పరీక్ష కీలకం
గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కాలికి ఫ్రాక్చర్ అవడం వల్ల పంత్ క్రికెట్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉండి కోలుకుంటున్న పంత్, అక్టోబర్ 10న కీలకమైన ఫిట్‌నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు. ఈ పరీక్షలో వైద్య బృందం నుండి "రిటర్న్ టు ప్లే" క్లియరెన్స్ లభిస్తే, పంత్ క్రికెట్‌లో పునరాగమనానికి అనుమతి లభించినట్లే.
సౌతాఫ్రికా టెస్ట్‌ల సన్నాహకంగా
రిషబ్ పంత్ నవంబర్ 14 నుంచి జరిగే దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ అంతర్జాతీయ సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసమే రంజీ ట్రోఫీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, పంత్ అక్టోబర్ 25 నుంచి జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండాలని అందుకుంటున్నాడు. ఒకవేళ పంత్ ఫిట్‌నెస్ సాధించి, రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉంటే, అతడు ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉంది.
ప్రమాదం నుంచి కోలుకుని..
2022 డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ సుమారు 14 నెలలు క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై జరిగిన ఆ ప్రమాదంలో తన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చేరేగాయి. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉంటూ కోలుకున్న పంత్, 2024లో ఐపీఎల్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో బంతి తగిలి ఆయన కాలికి ఫ్రాక్చర్ అయ్యింది.
ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటూ కోలుకుంటున్న పంత్, త్వరలో జరిగే రంజీ పోటీల్లో పాల్గొని, అద్భుతమైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. పంత్ వంటి కీలక ఆటగాడు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవడం భారత టెస్ట్ జట్టుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. అతడు పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించి, దక్షిణాఫ్రికా టెస్టుల నాటికి సిద్ధమవుతాడని సెలెక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించే సమయంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ పంత్ పరిస్థితి గురించి స్పందించాడు. “రిషభ్ ఈ సిరీస్‌కు సిద్ధం కాలేదు. కానీ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నాటికి పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాం. ఎప్పుడనేది టైమ్, డేట్ కచ్చితంగా చెప్పలేం కానీ, ఆయన రిటర్న్ చాలా దగ్గర్లోనే ఉంది” అని ఆగార్కర్ తెలిపాడు. మరోవైపు పంత్ పునరాగమనం వార్తలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు జాతీయ జట్టులో అతడి స్థానాన్ని నిర్ణయించనుంది.
పంత్ క్రికెట్ కెరీర్
భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో సుదీర్ఘ ఫార్మాట్ (టెస్టులు)లో టీమిండియాకు అనేక చారిత్రక విజయాలు అందించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. పంత్ 47 టెస్టుల్లో 3427 పరుగులు చేశారు. ఇందులో 8 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 31 వన్డేల్లో 871 పరుగులు, 76 టీ20ల్లో 1209 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ 125 మ్యాచ్‌లలో 34.16 సగటుతో 3,553 పరుగులు చేశాడు.
