Let's talk: editor@tmv.in
రివిజన్ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైంది: సోనియాగాంధీ

రివిజన్ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైంది: సోనియాగాంధీ

Pinjari Chand
8 ఫిబ్రవరి, 2026

తనపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను తప్పుదారి పట్టించే, ఆధారరహితమైన, రాజకీయ ప్రేరేపితమైనదిగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అభివర్ణించారు. దానిని కొట్టివేయాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పూర్తిగా అర్థరహితంగా, న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి సమానమని ఆమె తన వాదనలో పేర్కొన్నారు. ప్రత్యేక న్యాయమూర్తి (సీబీఐ) విశాల్ గోగ్నే ముందు న్యాయవాది ద్వారా దాఖలు చేసిన సమాధానంలో, భారత పౌరసత్వం పొందే కంటే ముందు ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణలను సోనియా గాంధీ ఖండించారు. ఈ ఆరోపణలపై దాఖలైన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును ఆమె కోరారు. ఫిర్యాదుదారు తప్పుదారి పట్టించే ఊహాగానాలు, మీడియా కథనాలు, వ్యక్తిగత అనుమానాల ఆధారంగా నిర్లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేశారని ఆమె తన వాదనలో తెలిపారు. ఎటువంటి పత్రాన్ని నకిలీగా మార్చారు, వక్రీకరించారన్న వివరాలు స్పష్టంగా చూపించలేదని, ఆరోపణలకు అవసరమైన ప్రామాణిక వివరాలే లేవని అన్నారు.

పౌరసత్వానికి సంబంధించిన అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, ఓటర్ల జాబితా తయారీ, నిర్వహణ బాధ్యత ఎన్నికల సంఘానిదేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలపై ప్రైవేట్ ఫిర్యాదులను స్వీకరించడం ద్వారా క్రిమినల్ కోర్టులు అధికార పరిధిలోకి ఎంట్రీ కావడం ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి సమానమని ఆమె వాదించారు.

తన పేరును నకిలీ పత్రాల ఆధారంగా ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చారన్న ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చారు. ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఉపయోగించారంటున్న దరఖాస్తు లేదా సంబంధిత రికార్డులను ఫిర్యాదుదారు కోర్టు ముందు ఉంచలేదని, చట్టబద్ధమైన మార్గాల్లో వాటిని పొందేందుకు ప్రయత్నించినట్టు కూడా చూపలేదని తెలిపారు. 1980 సాధారణ ఎన్నికల్లో ఆమె ఓటు హక్కు వినియోగించారన్న ఆరోపణలతో పాటు, నకిలీ ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉపయోగించారన్న వాదనలను కూడా సోనియా గాంధీ ఖండించారు. ఇవన్నీ ఆధారాల్లేని ఆరోపణలేనని కొట్టిపారేశారు.

పాత మీడియా కథనాలపై ఆధారపడటాన్ని ప్రశ్నించిన ఆమె, వాటికి చట్టబద్ధ గుర్తింపు లేదని, క్రిమినల్ కేసులకు అవి ఆధారంగా ఉండలేవని అన్నారు. 1980–83 మధ్యకాలానికి చెందిన అంశాలను నాలుగు దశాబ్దాల తర్వాత ఎటువంటి ప్రామాణిక పత్రాలు లేకుండా తిరిగి లేవనెత్తడం చట్టపరంగా నిలవదని అన్నారు.

ఫిర్యాదు నిర్వహణపరంగా కూడా చట్టబద్ధం కాదని సోనియా అభ్యంతరం తెలిపారు. బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు, ముఖ్యంగా చెల్లుబాటు అయ్యే అఫిడవిట్ దాఖలు చేయలేదని, అందువల్ల ఈ ఫిర్యాదును విచారించే అధికార పరిధి కోర్టుకు లేదని ఆమె వాదించారు. ఈ రివిజన్ పిటిషన్‌ను న్యాయవాది వికాస్ త్రిపాఠి దాఖలు చేయగా, 2025 సెప్టెంబర్‌లో మేజిస్ట్రేట్ కోర్టు ఆయన ఫిర్యాదును ప్రాథమిక దశలోనే కొట్టివేసింది. పౌరసత్వం, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయని, క్రిమినల్ ఫిర్యాదు ద్వారా వాటిని విచారించలేమని మేజిస్ట్రేట్ అప్పట్లో వ్యాఖ్యానించారు. తారన్నుమ్ చీమా, కనిష్కా సింగ్, ఆకాష్ సింగ్, అక్షయ్ నాగరాజన్‌ల ద్వారా దాఖలైన ప్రతివాదనలో, ఊహాగానాలు, పాత సూచనలు, ప్రాథమిక ఆధారాల లేమిపై ఆధారపడ్డ ఈ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేయాలని సోనియా గాంధీ కోర్టును కోరారు.

రివిజన్ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైంది: సోనియాగాంధీ - Tholi Paluku