Let's talk: editor@tmv.in
రిలయన్స్ ఫౌండేషన్ సరికొత్త రికార్డు: 3 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ!

రిలయన్స్ ఫౌండేషన్ సరికొత్త రికార్డు: 3 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ!

Dantu Vijaya Lakshmi Prasanna
30 జనవరి, 2026

ముంబైలో నిర్వహించిన '21st సెంచురీ స్కిల్స్ కాంక్లేవ్' (21వ శతాబ్దపు నైపుణ్యాల సదస్సు) వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ తన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో అద్భుతమైన పురోగతిని చాటిచెప్పింది.

ఇప్పటివరకు సుమారు 12 లక్షల మందికి పైగా ప్రజలను చేరుకున్న ఈ సంస్థ, 3 లక్షల మంది యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణను అందించి, అందులో 1.8 లక్షల మందికి పైగా యువతీ యువకులు వివిధ రంగాల్లో స్థిరపడేలా ఉపాధి అవకాశాలను కల్పించింది. దేశవ్యాప్తంగా మారుతున్న పని వాతావరణానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం, భారత ప్రభుత్వ 'స్కిల్ ఇండియా' మిషన్‌కు భారీ ఊతాన్నిస్తోంది. ఈ సదస్సులో పరిశ్రమల అధిపతులు, ప్రభుత్వ ప్రతినిధులు మారుతున్న ఉద్యోగ రంగంపై లోతైన చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర వృత్తి విద్యా శిక్షణ డైరెక్టర్ మాధవి సర్దేశ్ముఖ్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో కేవలం డిగ్రీలు ఉండటం కంటే వృత్తిపరమైన సామర్థ్యాలు కలిగి ఉండటమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ ఫౌండేషన్ తన శిక్షణా కార్యక్రమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక సాంకేతికతను జోడించి యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తోందని, ఇలాంటి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు (పిఎమ్-సేతు వంటివి) దేశాభివృద్ధికి ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.

నూపుర్ బాల్ (హెడ్ - స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్, రిలయన్స్ ఫౌండేషన్) రిలయన్స్ మాట్లాడుతూ, ఈ ఫౌండేషన్ ప్రధానంగా మూడు మార్గాల్లో యువతను తీర్చిదిద్దుతోంది. మొదటిది, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం. రెండోది, దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఈ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్‌డిసి) వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని విద్యా ప్రణాళికలను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మార్చడం. మూడోది, 'రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ' అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 100కు పైగా ఉచిత కోర్సులను యువతకు అందుబాటులోకి తీసుకువచ్చి, వారు ఇంటి నుండే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను నేర్చుకునేలా ప్రోత్సహించడం అని అన్నారు.

అరుణ్ కుమార్ పిళ్లై (సిఈ ఓ , నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మాట్లాడుతూ, రిలయన్స్ ఫౌండేషన్‌తో తమ భాగస్వామ్యం ద్వారా వేలాది మంది అభ్యర్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించగలిగామని తెలిపారు. రెండో దశలో ఈ ప్రభావాన్ని మరింత పెంచుతామని చెప్పారు.

కాశీష్ సావంత్ (నైపుణ్యం పొందిన యువతి) ఈ సందర్భంగా తను రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొంది ఏ విధంగా ఉద్యోగం సాధించిందో, తన ఆత్మవిశ్వాసం ఎలా పెరిగిందో తన అనుభవాన్ని పంచుకుంది.

వీరితో పాటు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇతర పరిశ్రమల నిపుణులు, శిక్షణ పొందిన సుమారు 40 మంది యువ విజేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 40 మంది యువ ప్రతిభావంతులను ప్రత్యేకంగా సత్కరించారు. ముఖ్యంగా కాశీష్ సావంత్ వంటి యువత సాధించిన విజయాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాయి. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, నిరంతర అభ్యాసం, డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువతను భావి భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడమే తమ అంతిమ లక్ష్యమని రిలయన్స్ ఫౌండేషన్ హెడ్ నూపుర్ బాల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.