
రియల్ ఎస్టేట్‌లోకి తగ్గిన పెట్టుబడులు
భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు తగ్గినట్టు ప్రముఖ ప్రాపర్టి కన్సల్టెన్సీ ఆన్రాక్ సంస్థ పేర్కొంది. జులై-సెప్టెంబర్ నెలల మధ్య 15 శాతం ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు తగ్గినట్టు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి దీనికి కారణమని ఆన్రాక్ సంస్థ విశ్లేషించింది. రెసిడెన్షియల్ విభాగంలో కొనుగోళ్లు ఉన్నప్పటికీ కమర్షియల్ విభాగంలో అనిశ్చితి నెలకొందని అభిప్రాయపడింది. రెసిడెన్షియల్ విభాగంలో సేల్స్ వాల్యూమ్ కారణంగా క్యాష్ ఫ్లో బాగానే ఉంది. కానీ కమర్షియల్ విభాగంలోనే ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా ధరలు పెరిగాయని, దీంతో పాటు మరికొన్ని అంతర్జాతీయ పరిస్థితులు అనిశ్చితికి కారణమైందని ఆన్రాక్ సంస్థ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం 2.6 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు రాగా.. 20225-26 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్లో 2.2 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు ఆన్రాక్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో విదేశీ మూలధన వాటా 73 శాతంగా ఉంది.
రెసిడెన్షియల్ విభాగంలో కొనుగోళ్లకు తగ్గిన జీఎస్టీ రేట్లు కూడా కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మాణ సామాగ్రి, ముడిపదార్థాల ధరలు అందుబాటులోకి రావడంతో ఇళ్ల ధరలు కూడా తగ్గాయి. తగ్గిన ధరలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా రెసిడెన్షియల్ విభాగంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. ప్రధానంగా కమర్షియల్ విభాగంలోనే అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు వ్యాపారాలపైన ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా కమర్షియల్ విభాగంలో కొనుగోళ్లు నెమ్మదిగా ఉన్నాయి.
మరోవైపు పెరిగిన ధరలు, ఇప్పటికే అవసరానికి మించి ఉన్న గృహాలు కారణంగా.. ఇన్వెంటరీ బాగా పెరిగిపోయింది. ఇది రియల్ ఎస్టేట్ సంస్థల బ్యాలెన్షీట్ పై ఒత్తిడికి కారణమవుతోంది. అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయి. పెరిగిన ఇన్వెంటరీ అమ్మడుపోకపోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తగ్గిన జీఎస్టీ రేట్లు .. ఇప్పుడు నిర్మించబోయే ఇళ్ల ధరల విషయంలో ప్రభావం చూపుతాయి. అంతేకానీ ఇప్పటికే నిర్మించిన ఇళ్ల విషయంలో ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు.
గతంలో ఉన్న అధిక ధరలకే నిర్మాణం జరిగి ఉంటుంది. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాత ధరలను లెక్కలోకి తీసుకుని ధరలు నిర్ణయిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ధరలు అధికంగా ఉంటే కస్టమర్లు కొనుగోలు చేయడంలేదు. తగ్గిస్తే కంపెనీలకు, బిల్డర్లకు నష్టం. తగ్గించకపోతే ఇన్వెంటరీ అమ్ముడుపోదు. ఎటు చూసినా వ్యాపారులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
