
రియల్టర్ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తునకు ఆదేశించం: కర్ణాటక హోం మంత్రి
ఐటీ అధికారులు విచారిస్తున్న సమయంలో ఓ రియల్టర్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న ఘటన బెంగుళూరులో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని ఆ రాష్ట్ర మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వివరాల ప్రకారం బెంగళూరులో కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసు దర్యాప్తు చేయాలని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర్ ఆదేశించారు. ఐటీ శాఖ అధికారులు కార్యాలయంలో ఉన్న సమయంలోనే రాయ్ తన లైసెన్సు తుపాకీతో కాల్చుకుని మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. డిసెంబర్‌లో రాయ్ సంస్థపై ఐటీ శాఖ తనిఖీలు జరిగాయని, చట్టప్రకారం 60 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉండటంతో ఫిబ్రవరి 4లోపు విచారణ నిమిత్తం ఆయనను పిలిచినట్లు మంత్రి తెలిపారు. దుబాయ్ నుంచి ఇటీవలే తిరిగొచ్చిన రాయ్ అధికారులకు సహకరిస్తున్నానని చెప్పారు.
ఐటీ అధికారులు స్టేట్‌మెంట్ నమోదు చేస్తున్న సమయంలో ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పిన రాయ్ తిరిగి రాకపోవడంతో కొద్దిసేపటికి ఘటన వెలుగులోకి వచ్చిందని వివరించారు. ఈ ఘటనకు ఐటీ చర్యల వల్ల వచ్చిన ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆత్మహత్య కేసుగా దర్యాప్తు జరుగుతుందని, ఇతర అంశాలు బయటపడితే వాటినీ పరిశీలిస్తామని పరమేశ్వర్ స్పష్టం చేశారు. రాజకీయ కోణంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. సీజే రాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా బెంగళూరు, దక్షిణ భారత నిర్మాణ రంగాల్లో పరిచయమైన వ్యక్తి. ఐటీ అధికారులు కార్యాలయంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం, కుటుంబ సభ్యుల ఆరోపణలు, విచారణకు సంబంధించిన అంశాల కారణంగా ఈ కేసు ప్రస్తుతం హై-ప్రొఫైల్‌గా మారింది.
ఇదే మొదటిసారి కాదు…
విచారణల ఒత్తిడి, అనుమానాలు – మళ్లీ ప్రశ్నల మధ్య నిలిచిన వ్యవస్థ
కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ మృతి ఘటనతో దేశవ్యాప్తంగా మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలు, దాడుల సమయంలో లేదా అనంతరం చోటుచేసుకునే ఆత్మహత్యలు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, ప్రతి సారి ‘విచారణ ఒత్తిడే కారణమా?’ అన్న సందేహం అలాగే మిగిలిపోతోంది. సీజే రాయ్ ఘటనలోనూ ఐటీ అధికారులు కార్యాలయంలో ఉన్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. కుటుంబ సభ్యులు విచారణ ఒత్తిడిని ప్రస్తావిస్తుంటే, ప్రభుత్వం మాత్రం వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే పోలీస్ విచారణ అవసరమని చెబుతోంది.
గతంలో జరిగన సంఘటనలు
2015లో కర్ణాటకలో ఐఏఎస్ అధికారి డీకే రవి మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, ఆయన తీసుకున్న అక్రమాలపై చర్యలే కారణమనే అనుమానాలు ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు. అలాగే, గత దశాబ్దంలో ఐటీ, ఈడీ విచారణలు ఎదుర్కొన్న పలువురు వ్యాపారులు, కంపెనీ ప్రమోటర్లు, చిన్న పరిశ్రమ యజమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదాహరణలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కుటుంబాలు ‘అతివిచారణ, మానసిక ఒత్తిడి’ని కారణంగా చూపాయి.
ఇది 2019లో ఐటీ–ఈడీ విచారణల అనంతరం కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి ఘటనను గుర్తు చేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చట్టం వేరు… అనుభవం వేరు
దర్యాప్తు సంస్థల వాదన ఒకటే చట్టం ప్రకారమే విచారణలు జరుగుతాయి. ఎవరినీ బలవంతం చేయం.కానీ మరో వైపు, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల మానసిక పరిస్థితి, సామాజిక పరువు, వ్యాపారంపై పడే ప్రభావం వంటి అంశాలు అధికారిక ఫైళ్లలో కనిపించవు. నోటీసులు, సమన్లు, విచారణలు ఇవన్నీ చట్టబద్ధమైనవైనా, వాటి మానసిక ప్రభావం మాత్రం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కోర్టుల దృష్టిలో
ఇప్పటివరకు వచ్చిన చాలా కేసుల్లో దర్యాప్తు సంస్థల ప్రత్యక్ష బాధ్యతను కోర్టులు నిర్ధారించలేదు.
అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం విచారణ పద్ధతులు మానవీయంగా ఉండాలని న్యాయస్థానాలు వ్యాఖ్యానించిన దాఖలాలు ఉన్నాయి. సీజే రాయ్ ఘటనతో మరోసారి దేశం ముందు విచారణలు కఠినంగా ఉండాలా? లేక మానవీయంగా ఉండాలా? లేదా… రెండూ ఒకేసారి సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే పోలీస్ నివేదిక కోసం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయన్న వాస్తవం, వ్యవస్థ పనితీరుపై సమాజం లోతుగా ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
