Let's talk: editor@tmv.in
రిమోట్ ఏరియాల్లో పోలీస్ కమ్యూనికేషన్‌కు ఆధునిక నిఘా

రిమోట్ ఏరియాల్లో పోలీస్ కమ్యూనికేషన్‌కు ఆధునిక నిఘా

Panthagani Anusha
11 జనవరి, 2026

రాష్ట్రంలోని అడవులు, కొండ ప్రాంతాలు సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేని మారుమూల ప్రాంతాల్లో పోలీసు సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా పోలీసుల మధ్య సమాచార మార్పిడి నిరంతరాయంగా కొనసాగేలా రూపొందించిన ‘రేస్’ (రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్) రెండో దశ వాహనాలను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల కోసం కేటాయించిన ఈ అధునాతన వాహనాలు కమ్యూనికేషన్ పరికరాలు ఇకపై క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అడవులు, తీరప్రాంతాలు విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు తరచుగా విఫలమవుతుంటాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగానికి ఎటువంటి ఆటంకం లేని సమాచార వ్యవస్థను అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రతి రేస్ వాహనం ఒక స్వతంత్ర మొబైల్ కమ్యూనికేషన్ కేంద్రంగా పనిచేస్తుందని అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇది ఒక 'కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని పైఅధికారులతో అనుసంధానం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వ పోలీస్ బలగాల ఆధునీకరణ బడ్జెట్ కింద దీనిని అమలు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. గతంలో 2018-19లో చేపట్టిన మొదటి దశలో రూ. 2.13 కోట్ల వ్యయంతో ఫోర్ విల్లర్ వెహికిల్స్ 20 ద్విచక్ర వాహనాలను పంపిణీ చేయగా తాజాగా 2025-26 రెండో దశలో భాగంగా మరో రూ. 2 కోట్లు వెచ్చించి 8 నాలుగు చక్రాల వాహనాలను, 16 ద్విచక్ర వాహనాలను కొత్తగా సమకూర్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ వాహనాలు కేవలం పోలీస్ శాఖకే కాకుండా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తాయని ఆయన అన్నారు.

ఇక గత అనుభవాలను గుర్తు చేస్తూ కాచులూరు,పోలవరం ప్రాంతాల్లో జరిగిన పడవ ప్రమాదాల సమయంలో ఈ రేస్ వాహనాలు ఏ విధంగా ప్రాణరక్షణ చర్యల్లో కీలక పాత్ర పోషించాయో డీజీపీ వివరించారు. కమ్యూనికేషన్ సదుపాయాలు లేని ఆ కొండ ప్రాంతాల్లో ఈ వాహనాలే ప్రత్యేక కమ్యూనికేషన్ సాధనాలుగా నిలిచి సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు, భారీ జాతరలు, నిరసనల సమయంలో శాంతిభద్రతల నిర్వహణకు, విపత్తుల సమయంలో వేగంగా స్పందించడానికి ఈ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

చివరగా రాష్ట్రవ్యాప్తంగా చివరి మైలు వరకు కమ్యూనికేషన్ సౌకర్యాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజల భద్రతను మరింత మెరుగుపరుస్తామని సాంకేతికత ఆధారిత పోలీసింగ్ దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వేస్తున్న ఈ అడుగు ఆధునిక భద్రతా వ్యవస్థకు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజీపీ చ. శ్రీకాంత్, డీఐజీ ఎన్.ఎస్.జే. లక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.