Let's talk: editor@tmv.in
రిబ్స్‌లో గాయం వలన ఐసీయూలో చికిత్స పొందుతున్న అయ్యర్

రిబ్స్‌లో గాయం వలన ఐసీయూలో చికిత్స పొందుతున్న అయ్యర్

Sandhula Dinesh
28 అక్టోబర్, 2025

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అద్భుతమైన క్యాచ్ అందుకున్న భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు స్ప్లీన్ గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం జరిగింది. ఈ ఘటనతో 30 ఏళ్ల క్రికెటర్ సిడ్నీలోని ఐసీయూలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో అలెక్స్ కేరీని అవుట్ చేసేందుకు వెనక్కి డైవ్ చేసిన అయ్యర్ ఎడమ రిబ్ కేజ్ పై అసాధారణంగా పడ్డారు. వెంటనే నొప్పితో కుంగిపోయిన ఆయన డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకుని మూర్ఛపోయారు. జట్టు వైద్య సిబ్బంది తక్షణం ఆసుపత్రికి తరలించగా, స్కాన్‌లో స్ప్లీన్‌కు చీలిక ఏర్పడి రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు.

బీసీసీఐ అధికారిక ప్రకటనలో ‘శ్రేయస్ అయ్యర్ ఎడమ దిగువ రిబ్ ప్రాంతంలో దెబ్బ తగిలింది. స్ప్లీన్‌కు చీలిక గాయం సంభవించింది. చికిత్స పొందుతున్న ఆయన స్థిరంగా, మెరుగుపడుతున్నారు’ అని పేర్కొంది. సిడ్నీ, భారత నిపుణులతో సంప్రదించి బీసీసీఐ వైద్య బృందం ఆయన పురోగతిని గమనిస్తోంది. భారత జట్టు డాక్టర్ సిడ్నీలోనే ఉంటూ పర్యవేక్షిస్తారు.

జట్టు వర్గాల సమాచారం ప్రకారం, ఆరంభంలో ఆయన ప్రాణాంతక స్థితిలోకి జారుకున్నారు. వైద్యుల తక్షణ చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ‘గత రెండు రోజులుగా ఐసీయూలో ఉన్నారు. ఆలస్యమైతే ప్రమాదకరంగా మారేది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

సిడ్నీలో కనీసం ఒక వారం పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు. అంతర్గత రక్తస్రావం కారణంగా ముందుగా అంచనా వేసిన మూడు వారాల కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. టీ20 జట్టులో లేని అయ్యర్ పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టి పెట్టనున్నారు. క్రికెట్ అభిమానులు, సహచరులు ఆయన త్వరగా మైదానంలోకి రావాలని ఆశిస్తున్నారు.