Let's talk: editor@tmv.in
రిపబ్లిక్ డే 'స్పెషల్' భోజనం.. చిరిగిన కాగితాలపై!

రిపబ్లిక్ డే 'స్పెషల్' భోజనం.. చిరిగిన కాగితాలపై!

Dantu Vijaya Lakshmi Prasanna
28 జనవరి, 2026

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (జనవరి 26, 2026) ఘనంగా జరుగుతున్న వేళ, మధ్యప్రదేశ్‌లోని మైహర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఘోర అవమానం జరిగింది. పౌరుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే రాజ్యాంగ ఉత్సవం రోజే, చిన్నారుల గౌరవాన్ని కాలరాసేలా అధికారులు వ్యవహరించారు.

మైహర్ జిల్లాలోని భటిగవా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే, ఆ భోజనాన్ని వడ్డించడానికి కనీసం ప్లేట్లు గానీ, ఆఖరికి విస్తరాకులు (పత్తల్) గానీ ఏర్పాటు చేయలేదు. బదులుగా, పిల్లలకు వేడివేడి హల్వా, పూరీలను పాత నోట్‌బుక్‌ల నుండి చింపిన కాగితాలపై వడ్డించారు. సిరా ఉన్న కాగితాలపై వేడి పదార్థాలు వడ్డించడం వల్ల ఆ రసాయనాలు ఆహారంలో కలిసి విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కఠినమైన చలిలో పిల్లలు ఆరుబయట నేలపై కూర్చుని, కాగితాల్లోని ఆహారాన్ని తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రభుత్వం తీసుకున్న చర్యలు

ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. పాఠశాల ఇన్-ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ త్రిపాఠిని సస్పెండ్ చేయాలని జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కాంట్రాక్ట్ ఉద్యోగి, బిఆర్సి ప్రదీప్ సింగ్ ఒక నెల జీతాన్ని కట్ చేశారు. జిల్లా పంచాయితీ మిడ్-డే మీల్ విభాగం ఇన్-ఛార్జ్, డిపిసి విష్ణు త్రిపాఠికి మైహర్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

రాజకీయ ప్రకంపనలు:

విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై తీవ్రంగా మండిపడింది. "ఇదేనా మీ సుపరిపాలన?" అంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రిపబ్లిక్ డే 'స్పెషల్' భోజనం.. చిరిగిన కాగితాలపై! - Tholi Paluku