
రిపబ్లిక్ డే ముందు ఉగ్రదాడులు జరిగే అవకాశం: ఇంటెలిజెన్స్
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్రయత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) వర్గాల సమాచారం ప్రకారం, పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో ఉన్న ఖలిస్తానీ, తీవ్రవాద హ్యాండ్లర్లకు ‘ఫుట్ సోల్జర్లుగా’పనిచేస్తూ, దేశ అంతర్గత భద్రతను కలవర పెట్టే ప్రయత్నాల్లో భాగస్వాములవుతున్నారు. నేరపూరిత నెట్‌వర్క్‌లను ఉపయోగించి తమ అజెండాలను అమలు చేసేందుకు ఈ హ్యాండ్లర్లు ప్రయత్నిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. జనవరి 26ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో క్రియాశీలంగా ఉన్న ఈ గ్యాంగ్‌స్టర్లు ఖలిస్తానీ ఉగ్రవాద అంశాలతో క్రమంగా సంబంధాలు పెంచుకుంటున్నారని హెచ్చరికలో పేర్కొన్నారు.
నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.
ఇదే సమయంలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముందు భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఉత్తర ఢిల్లీ జిల్లా పోలీసులు పలు సున్నిత, రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 2026 జనవరి తొలి పక్షంలోనే నాలుగు మాక్ డ్రిల్స్ నిర్వహించి, వివిధ శాఖల స్పందన సామర్థ్యం, అప్రమత్తతను పరీక్షించారు. ఎర్రకోట, ఐఎస్‌బీటీ కాశ్మీర్ గేట్, చాందీని చౌక్, ఖారి బావోలి, సదర్ బజార్, మెట్రో స్టేషన్లు వంటి అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. ఉగ్రవాద చర్యలపై అప్రమత్తత పెంచడం, ప్రజలు, అధికార యంత్రాంగాన్ని ముందస్తుగా హెచ్చరించడమే ఈ డ్రిల్స్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కనీసం 30 శకటాలు పాల్గొననున్నాయి. ఇవి భారతదేశ సాంస్కృతిక వైభవం, అభివృద్ధి విజయాలను ప్రతిబింబించనున్నాయి. ఈ శకటాలు ‘స్వాతంత్ర్య కా మంత్ర – వందే మాతరం’, ‘సమృద్ధి కా మంత్ర – ఆత్మనిర్భర్ భారత్’ అనే థీమ్‌లపై ప్రదర్శిస్తారు. జాతీయ గీతమైన వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భానికీ ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
